పెళ్లి వద్దు... వచ్చి ఆపేయండి ప్లీజ్... షీ టీమ్స్‌కు యువతి ఫోన్...
'మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను సమాజ పురోగతిని అంచనా వేస్తాను..' అంటారు రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్. అంటే సమాజం అభివృద్ది మహిళాభివృద్దిపై ఆధారపడి ఉందని ఆయన విస్పష్టంగా చెప్పారు. కానీ ఇప్పటికీ విద్యా,ఉద్యోగం,ఇతరత్రా విషయాల్లో పురుషలతో పోల్చితే మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్లకు చదువు,ఉద్యోగం ఎందుకనే ముతక ఆలోచనలు ఇప్పటికీ ప్రక్షాళన కావట్లేదు. తాజాగా షాద్‌నగర్‌లో చోటు చేసుకున్న ఓ ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

అసలేం జరిగింది...
షాద్‌నగర్ పరిధిలోని ఫరూఖ్ నగర్ గుండుకేరికి చెందిన ఓ యువతి(18) పదో తరగతి పూర్తి చేసింది. ఇంటర్ చదువు కోసం ఏదైనా కాలేజీలో చేరాలనే ఆలోచనలో ఉంది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆడపిల్లకు అంతకంటే ఎక్కువ చదువు ఎందుకని ఆలోచించారు. పదో తరగతితోనే చదువు మాన్పించి పెళ్లి చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే ఓ అబ్బాయిని చూసి పెళ్లి కుదిర్చారు. ఈ నెల 31న పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

రంగంలోకి షీ టీమ్...
అయితే ఆ యువతికి మాత్రం పెళ్లి కంటే చదువు పైనే ధ్యాస. ఎలాగైనా పెళ్లిని తప్పించుకుని చదువును కొనసాగించాలని భావించింది. ఈ క్రమంలో షాద్ నగర్ షీ టీమ్ పోలీసులకు ఫోన్ చేసి తన ఆవేదన వెలిబుచ్చింది. ఎలాగైనా తన పెళ్లి ఆపాలని కోరింది. దీంతో పోలీసులు ఆమె ఇంటికి చేరుకున్నారు. యువతి లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రభుత్వ సవతి గృహంలో చేర్చి తనకు చదువుకునే అవకాశం కల్పించాలని ఆ పోలీసులను యువతి కోరింది. దీంతో యువతిని హైదరాబాద్ వనస్థలిపురంలోని సఖి కేంద్రానికి తరలించారు.
Recommended Video

కఠిన చర్యలు తప్పవని షీ టీమ్ హెచ్చరిక
అమ్మాయిల పట్ల వివక్ష,వేధింపులు తగవని షీ టీమ్ బృందం స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అమ్మాయిలు ఎలాంటి వివక్ష,వేధింపులకు గురైనా ధైర్యంగా షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని షాద్‌నగర్ జోన్ ఇన్‌చార్జ్, ఏఎస్‌ఐ జయరాజ్ తెలిపారు.వివరాలు అందించిన వారి సమాచారం, పేరును గోప్యంగా ఉంచుతామన్నారు. సమాజంలో ఆడపిల్లలపై పెరుగుతున్న వివక్ష,దాడుల పట్ల అవగాహన కల్పిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications