Hyderabad News: వారే హత్య చేయించారు.. నారాయణ రెడ్డి మర్డర్ కేసులో వీడిన మిస్టరీ..
సంగారెడ్డి జిల్లా జిన్నారం అడవుల్లో శవమై కనిపించిన నారాయణరెడ్డిని అతని అత్తమామలే హత్య చేయించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. జూలై 3న సంగారెడ్డి జిల్లా జిన్నారం అడవుల్లో నారాయణ రెడ్డి మృతదేహం లభ్యమైంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం పంచాయతీ పి.పొట్రెడ్డిపల్లెకి చెందిన శనివారపు బాలిరెడ్డి, నారాయణమ్మ దంపతుల కుమారుడు నారాయణరెడ్డి (25) బీటెక్, హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన దూరపు బంధువైన కందుల వెంకటేశ్వరరెడ్డి కుమార్తె రవళిని ప్రేమించి ఏడాది క్రితం గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ వివాహం అమ్మాయి తరుఫువారి నచ్చకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు ఇద్దరి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. కొద్ది రోజుల తర్వాత రవళి తల్లిదండ్రుల వచ్చి ఓ వారంలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని, కుమార్తెను ఇంటికి పంపించాలని తల్లిదండ్రులు కోరడంతో రవళిని వారితో పంపించాడు నారాయణ రెడ్డి. ఆ తర్వాత రవళీని తిరిగి పంపించలేదు. దీంతో అతను హైకోర్టులో పిటిషన్ వేశాడు. నారాయణ రెడ్డిని అడ్డు తొలగించి తమ కూతురు మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వరరెడ్డి బంధువు శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రణాళిక రచించాడు.

జూన్ 27న రాత్రి 8.40 గంటల సమయంలో మిత్రులు కాశీ, ఆశిక్‌తో కలిసి కేపీహెచ్‌బీలో ఉంటున్న నారాయణరెడ్డి వద్దకు వెళ్లిన శ్రీనివాసరెడ్డి, విందు చేసుకుందామని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. నారాయణరెడ్డిని కారులో ఎక్కించుకుని ఖాజాగూడ వైపు తీసుకెళ్లారు. ఖాజాగూడలో మద్యం కొని, జిన్నారం వైపు వెళ్లారు. నారాయణరెడ్డిని మార్గమధ్యంలో గొంతు నులిమి హత్య చేశారు. జిన్నారం శివార్లలోని అడవిలోకి మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేశారు.అక్కడి నుంచి వారంతా పరారయ్యారు.
నారాయణరెడ్డి 3 రోజులుగా తిరిగిరాలేదని అతనితోపాటు గదిలో ఉంటున్న బావ చంద్రశేఖర్‌రెడ్డి గత నెల 30న కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నారాయణరెడ్డితోపాటు అనుమానితుల ఫోన్‌కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు శనివారం రాత్రి ఆశిక్‌ను పట్టుకున్నారు. దీంతో అసలు విషయం బయటపడింది.












Click it and Unblock the Notifications