భారత ఫార్మాసంస్థ దగ్గుమందు తాగి 66మంది చిన్నారులు మృతి; గాంబియా మరణమృదంగంపై డబ్ల్యూహెచ్ఓ సీరియస్
పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. భారత ఫార్మా కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ ల కారణంగా దేశంలో ఇప్పటి వరకు గాంబియాలో 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇక దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తూ వైద్య ఉత్పత్తుల హెచ్చరికను జారీ చేసింది.
భారత్ ఫార్మా దిగ్గజం దగ్గుమందుతో 66 మంది చిన్నారుల మృతి
భారత్ కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్ లను ఉపయోగించిన పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ వ్యాధులు వచ్చాయని, గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణం ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రోమెథజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్ మాలిన్ బేబీ కఫ్ సిరప్, మేకాఫ్ బేబీ కఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ అనే నాలుగు ఔషధాలపై డబ్ల్యూహెచ్ఓ వైద్య ఉత్పత్తుల హెచ్చరికను జారీ చేసింది. ఇవి ఏ మాత్రం సురక్షితం కాదని, రోగుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయని సూచిస్తుంది.

భారత రెగ్యులేటరీ అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్న డబ్ల్యూహెచ్ఓ
నాలుగు ఉత్పత్తుల నమూనాలను పరిశీలిస్తే డైథలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ పరిమితికి మించి ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇవి పరిమితి దాటితే విషపూరితంగా మారతాయని మెడికల్ ప్రోడక్ట్ అలర్ట్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గాంబియా దుర్ఘటనపై సంబంధిత భారత రెగ్యులేటరీ అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్పత్తులు సురక్షితం కాదని వాటిని వెంటనే ఆపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. ఈ ఉత్పత్తుల ఉపయోగం మరణాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

వైద్య ఉత్పత్తుల అలెర్ట్ జారీ చేసిన డబ్ల్యూహెచ్ఓ.. స్పందించని ఫార్మా సంస్థ
ఈ కలుషితమైన ఉత్పత్తులు ఇప్పటివరకు గాంబియాలో మాత్రమే గుర్తించారు. ఇతర దేశాలకు కూడా ఈ ఉత్పత్తుల పంపిణీ జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైద్య ఉత్పత్తుల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని సిఫార్సు చేస్తుంది. ఇదిలా ఉంటే తమ వైద్య ఉత్పత్తులతో గాంబియాలో చిన్నారులు మృతి చెందారు అన్న అంశంపై స్పందించడానికి మైడెన్ ఫార్మా సంస్థ నిరాకరించింది.












Click it and Unblock the Notifications