చైనాకు వెళ్లి ఆ డేంజరస్ వైరస్‌ను మోసుకొచ్చాడు..
లక్నో: అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ బీఎఫ్ 7 వేరియంట్ పాజిటివ్ కేసులు దేశంలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 227 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. శనివారం ఈ సంఖ్య 201 వద్దే పరిమితమైంది. ఇప్పుడిది పెరిగింది. దీనితో యాక్టివ్ కేసుల సంఖ్య 3,424కు చేరింది. మొత్తం రికవరీలు 4,46,77,106గా రికార్డయ్యాయి. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య అయిదున్నర లక్షలకు చేరువైంది.
చైనాకు వెళ్లొచ్చిన ఓ 40 సంవత్సరాల వ్యక్తి ఒకరు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలారు. ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన ఆ వ్యక్తి కొద్దిరోజుల కిందట వ్యాపార పనుల నిమిత్తం చైనాకు వెళ్లారు. రెండు రోజుల కిందటే స్వస్థలానికి వచ్చారు. విమానాశ్రయంలో ఆయన నుంచి శాంపిళ్లను సేకరించారు హెల్త్ వర్కర్లు. ఇవ్వాళ వాటికి సంబంధించిన నివేదికలు అందాయి. ఆ వ్యక్తికి ప్రమాదకరమైన కరోనా వైరస్ సోకినట్లుగా తేలింది.

ఈ నెల 23వ తేదీన ఆయన చైనా నుంచి తొలుత ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆగ్రాకు తిరిగి వచ్చారు. ఈ నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం లక్నోలోని వైరాలజీ సెంటర్కు పంపించినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యంతోనే ఉన్నారని, ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉన్నారని చెప్పారు. జీనోమ్ సీక్వెన్స్ కు సంబంధించిన నివేదికలు అందిన తరువాత ఆ వైరస్ వేరియంట్ గురించి తెలుస్తుందని అన్నారు.

ఇప్పుడున్న లక్షణాలను బట్టి చూస్తోంటే బీఎఫ్ 7 వేరియంట్ కావొచ్చని భావిస్తున్నామని అరుణ్ శ్రీవాస్తవ చెప్పారు. చైనా నుంచి వచ్చిన తరువాత ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా టెస్ట్-ట్రాక్-ట్రీట్ మెంట్-వ్యాక్సినేషన్ కు తాము శ్రీకారం చుట్టామని, దీని ఆధారంగానే ఆగ్రా వ్యక్తి కాంటాక్ట్స్ ను సేకరిస్తోన్నామని చెప్పారాయన.












Click it and Unblock the Notifications