సార్, మా షాపులో ఉప్పు, పప్పు, బియ్యంతో పాటు లిక్కర్ అమ్ముకుంటా, ఓకే చెప్పండి !
మద్యం విక్రయాలకు ప్రభుత్వాలు లైసెన్స్ లు ఇస్తుంటాయి. మద్యం విక్రయాలు జరుగుతున్న రాష్ట్రాల్లో అక్రమ మద్యం విక్రయించకుండా ఆ రాష్ట్రాల ఎక్సైజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇంత జరిగినా కొన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీ నాయకులే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం విక్రయిస్తూ భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఇక్కడ కథ వేరేలా ఉంది.
చిల్లర దుకాణంలో మద్యం అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ వ్యక్తి ఎక్సైజ్ శాఖకు లేఖ రాయడం, ఆ లేఖ బయటకు రావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కర్ణాటక ఎక్సైజ్ శాఖ అధికారులకు లేఖ రాసిన వ్యక్తి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని హిరయూరు తాలూకాలోని హోస్నాయకరహట్టి గ్రామానికి చెందిన కర్ణాటక రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ హెచ్.సీ. చంద్రశేఖర్ ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులకు లేఖ రాసి వార్తల్లో నిలిచారు.

తన చిల్లర దుకాణంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక ఎక్సైజ్ శాఖ అధికారులకు చంద్రశేఖర్ వినతి పత్రం అందించారు. నేను హోస్నాయకరహట్టి గ్రామంలో నివాసం ఉంటున్నానని, మా ఇంటిలో ఒక చిన్న కిరాణా దుకాణాన్ని ప్రారంభించానని, ఈ రిటైల్ దుకాణంలో మద్యం విక్రయించడానికి ఆసక్తిగా ఉన్నానని, దయచేసి నా రిటైల్ షాపులో లిక్కర్ విక్రయించడానికి తనకు అనుమతించాలని అభ్యర్థిస్తున్నానని చంద్రశేఖర్ కర్ణాటక ఎక్సైజ్ శాఖ అధికారులకు లేఖ రాసి అందులో ఆయనే స్వయంగా సంతకం చేశారు.
హెచ్‌సీ చంద్రశేఖర్ విజ్ఞప్తి లేఖను ఎక్సైజ్ శాఖ అధికారులు స్వీకరించారు. అయితే ఓ సంఘం నాయకుడు అతని కిరాణా షాపులో మద్యం విక్రయించడానికి అనుమతి కోరుతూ ఇచ్చిన వినతి పత్రం స్వీకరించిన కర్ణాటక ఎక్సైజ్ శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. మొత్తం మీద కర్ణాటక ఎక్సైజ్ శాఖ అధికారులకు చంద్రశేఖర్ ఝలక్ ఇచ్చాడు.
వివిధ డిమాండ్ల సాధన కోసం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద ధర్నా చేస్తున్న ఫెడరేషన్ ఆఫ్ వైన్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులతో కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్.బి.తిమ్మాపూర్ చర్చలు జరిపి వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు. రిటైల్ మద్యం అమ్మకాల లాభాల పెంపు సహా పలు డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రాన్ని మంత్రి ఆర్‌బీ తిమ్మాపుర్ స్వీకరించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తిమ్మాపూర్ ఆ సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications