పెన్షన్ల వ్యవస్థను మలుపు తిప్పిన మోదీ సర్కార్..
UPS: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు చేయబోతోన్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్.. దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పెన్షన వ్యవస్థలో సమూల మార్పులకు నాంది పలికినట్టయింది.
అటు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడటమే కాకుండా.. కెేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులను కూడా పకడ్బందీగా మార్చగల సామర్థ్యం ఈ యూపీఎస్‌కు ఉంది. పదవీ విరమణ చేసిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు ఆర్థిక సుస్థిరతను కల్పించగలదీ స్కీమ్.

పెన్షన్ల వ్యవస్థలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఈ సంస్కరణ వల్ల పింఛనుదారులకు ఆర్థిక భద్రత కలుగుతుందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అంతే కాకుండా- కేంద్రం, రాష్ట్రాల మధ్య ఫెడరల్ వాదాన్ని మరింత బలోపేతం చేస్తుందనే సూత్రాన్ని మోదీ ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులు.. తమ చివరి 12 నెలల సర్వీస్ కాలంలో పొందిన సగటు బేసిక్ శాలరీలో 50 శాతం మొత్తాన్ని పెన్షన్‌గా పొందగలరు ఈ యూపీఎస్ విధానంలో. రిటైర్మెంట్ తరువాత కూడా బేసిక్ శాలరీలో సగం వేతనాన్ని పొందడం వల్ల వారికి ఆర్థిక భరోసాను అందజేసినట్టవుతుంది.
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి గతంలో అమలు చేసిన పెన్షన్ల సంస్కరణ ప్రధాన సూత్రాలకు అనుగుణంగా, ఎలాంటి రాజీ ధోరణిని ప్రదర్శించకుండా వాటిని కొనసాగించబోతోంది మోదీ ప్రభుత్వం. ప్రభుత్వాలు- ఉద్యోగుల ప్రయోజనాలను సమతుల్యం చేయగలుగుతుంది.
పాత పెన్షన్ విధానానికి పూర్తి విరుద్ధం ఇది యూపీఎస్. ఓపీఎస్ వల్ల గతంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలపై పెను ఆర్థిక భారం పడిన విషయం తెలిసిందే. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఓపీఎస్‌ను పునఃప్రవేశపెట్టడం వల్ల ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చింది.
పాత పెన్షన్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టడం వల్ల ఆర్థిక వ్యయం అపారంగా ఉంటుందని, నేషనల్ పెన్షన్ స్కీమ్‌తో పోల్చి చూస్తే ఆర్థిక భారం నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఒకవంక- కీలకమైన మూలధన పెట్టుబడులకు అవసరమైన ఆర్థిక కేటాయింపులు చేస్తూ, మరోవంక ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుకుంటూ మోదీ ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. బేసిక్ శాలరీలో ప్రభుత్వ వాటాను 18.5 శాతానికి పెంచడం, ఉద్యోగి కాంట్రిబ్యూషన్‌ను 10 శాతానికి పరిమితం చేయడం ద్వారా వారికి ఇచ్చిన హామీ పెన్షన్, పెన్షన్ ఫండ్ మధ్య ఆంతర్యాన్ని తొలగించినట్టయింది.
సుస్థిరమైన పెన్షన్ మోడల్‌ను అనుసరించేలా రాష్ట్రాలను యూపీఎస్ మరింత ప్రోత్సహించగలుగుతుంది. ఫలితంగా- కేంద్రం, రాష్ట్రాల మధ్య ఫెడరల్ వ్యవస్థను మరింత బలోపేత చేసినట్టవుతుంది. తమ ఆర్థిక స్థిరత్వానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు కేటాయింపులు చేసే వెసలుబాటు రాష్ట్రాలకు లభిస్తుంది.
యూపీఎస్ అమలు చేయడం వల్ల పెన్షన్ వ్యవస్థలో సంస్కరణలకు తెర తీసినట్టు మాత్రమే కాకుండా.. రాష్ట్రాల ఆర్థిక సమతుల్యత, సంక్షేమ పథకాల అమలును ఏకకాలంలో సాధించినట్టవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడటంతో పాటు లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్‌ను సురక్షితం చేయగలుగుతుందీ కొత్త పెన్షన్ స్కీమ్.












Click it and Unblock the Notifications