Abhishek Banerjee: మేనల్లుడికి ట్రీట్మెంట్ నిర్లక్ష్యం-ఆస్పత్రిపై మమత ఫైర్-రాహుల్ ఆఫర్..!
పశ్చిమబెంగాల్లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee)పై బీజేపీ కార్యకర్తలు నిన్న చేసిన దాడి తర్వాత పరిస్ధితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. బీజేపీ దాడుల్లో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు సోనార్ పూర్ వెళ్లిన అభిషేక్ బెనర్జీపై పోలీసుల సమక్షంలో స్థానికుల ముసుగులో కొందరు దాడికి పాల్పడ్డారు. రాళ్లు రువ్వుతూ, బట్టలు చించేసి మరీ వెంబడించారు. వీరి దాడి నుంచి తప్పించుకునేందుకు అభిషేక్ తలకు హెల్మెట్ పెట్టుకోవాల్సి వచ్చింది. చివరకు పోలీసుల సాయంతో బయటపడ్డ అభిషేక్ స్థానిక బెల్ వ్యూ ఆస్పత్రిలో చేరారు.
అయితే బెల్ వ్యూ ఆస్పత్రిలోనూ అభిషేక్ కు చికిత్స అందించకుండా డిశ్చార్జ్ చేయాలంటూ బీజేపీ నేతలు ఫోన్లు చేయడంతో పరిస్ధితి మరింత ఉద్రిక్తంగా మారింది. తన మేనల్లుడు అభిషేక్ కు సరైన వైద్యం అందించకుండా డిశ్చార్జ్ చేసేందుకు ఆస్పత్రి చేస్తున్న ప్రయత్నాలపై మమతా బెనర్జీ సీఈఓ ప్రదీప్ టాండన్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు తప్పుచేస్తున్నారని, గతంలో చేసిన సాయం మర్చిపోతున్నారని, దేవుడు మిమ్మల్ని క్షమించడని తెలిపారు. మీ అహంకారం గుర్తుంచుకుంటాం, బీజేపీ నుంచి అధికారం తమకు మారగానే మేం చేయాల్సింది చేస్తామని హెచ్చరికలు చేశారు.

This is Congress.
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) May 31, 2026
This is Rahul Gandhi.
When an alliance partner faces a storm,
we don’t step aside ,
we step forward.
We stand with them.#AbhishekBanerjee pic.twitter.com/mU2mqE4a7F
మరోవైపు బెల్ వ్యూ ఆస్పత్రిలో సరైన చికిత్స అందకపోవడంతో అభిషేక్ ను డిశ్చార్జ్ చేసి మమత తన ఇంటికి తీసుకెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అక్కడే ఆయనకు వ్యక్తిగత డాక్టర్ల సాయంతో చికిత్స అందిస్తున్నారు. అటు అభిషేక్ పై దాడి, సరైన చికిత్స అందించకపోవడంపై విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. మమతా బెనర్జీకి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. అవసరమైతే అభిషేక్ బెనర్జీకి హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తామని ఆఫర్ చేశారు. అయితే ప్రస్తుతానికి ఇంట్లోనే అభిషేక్ కు చికిత్స అందిస్తున్నట్లు మమత రాహుల్ కు తెలిపారు. రాహుల్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని మమత స్వయంగా బయటపెట్టారు.

మరోవైపు అభిషేక్ బెనర్జీపై దాడి నేపథ్యంలో మమతా బెనర్జీకి ఇండియా కూటమి నేతలు వరుసగా ఫోన్లు చేసి సంఘీభావం తెలుపుతున్నారు. అవసరమైతే బెంగాల్లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ కార్యాచరణ చేపడతామని మమతకు వారు ధైర్యం చెప్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో జూన్ 2న మమతా బెనర్జీ పిలుపునిచ్చిన బెంగాల్ బంద్ కార్యక్రమం మరింత ఉద్రిక్తతలకు కారణమయ్యేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications