"మహిళలకు ఉచితంగా ఏసీలు.. స్టడీ లోన్ మాఫీ"
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. తమిళనాట అధికారాన్ని నిలుపుకునేందుకు డీఎంకే- కాంగ్రెస్ కూటమి శ్రమిస్తోంది. తిరిగి అధికారం పొందేందుకు ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న టీవీకే పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్.. విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఈసారి రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన AIADMK మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేరకు AIADMK చీఫ్ ఎడప్పాడి కే పళనిస్వామి పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. మహిళలకు ఉచితంగా ఏసీలు అందిస్తామని హామీ ఇచ్చారు. అధికార డీఎంకే అవినీతిలో కూరుకుపోయిందని స్పష్టం చేశారు. చెన్నైలో డీఎంకే ప్రభుత్వం 'కమీషన్, కలెక్షన్ కరప్షన్' అనే పాలన చేస్తోందని ఎద్దేవా చేశారు.
డీఎంకే పాలనలో అవినీతి సర్వసాధారణంగా మారిందని.. తమకు ఓటేసి గెలిపిస్తే తమిళనాడును అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు కలిగి ఉండి, కుటుంబ పెద్ద మహిళగా ఉన్న కుటుంబాలకు ఉచితంగా ఏసీలు అందిస్తామని AIADMK చీఫ్ ఎడప్పాడి కే పళనిస్వామి హామీ ఇచ్చారు. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో ను విడుదల చేశారు.
విద్యార్థులకు మేలు కలిగించే విధంగా విద్యార్థులు.. స్టడీ కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే వృద్ధులకు అందించే నెలవారీ పింఛన్ ను రూ. 2000 లకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇక తమిళ్ మానిలా కాంగ్రెస్ పార్టీ చీఫ్ జీకే వాసన్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో AIADMK కూటమి ఘనవిజయం సాధించబోతున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడులో ఎన్డీఏ కూటమికి పాజిటివ్ వేవ్ ఉందని అన్నారు.

మరోవైపు ఇటీవల AIADMK- BJP కూటమి మధ్య సీట్ల పంపకాలు జరిగిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీకు 27 సీట్లు దక్కాయి. అలాగే పట్టాలి మక్కల్ కట్చీ పార్టీకి 18 సీట్లు, అమ్మ మక్కల్ మున్నేత్ర కజగం పార్టీకి 11 సీట్లు దక్కాయి. ఇక తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. మే 4 న ఫలితాలు వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications