పన్నీరు సెల్వంకు ఝలక్, మద్దతు లేదు: 'ముఖ్యమంత్రి'పై ఉత్కంఠ
జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీలో తదుపరి ముఖ్యమంత్రిగా భావిస్తున్న పన్నీరు సెల్వంకు షాక్ తగిలింది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీలో తదుపరి ముఖ్యమంత్రిగా భావిస్తున్న పన్నీరు సెల్వంకు షాక్ తగిలింది.
అమ్మ ఆరోగ్యంపై సరైన ప్రకటన రాకపోవడంతో అసలేం జరుగుతుందో తెలియక ప్రజలు గందరగోళంలో ఉన్నారు. జయ కోసం ఆస్పత్రి వద్ద రోదిస్తున్నారు. ఇదే సమయంలో సాయంత్రం ఆరు గంటలకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం పైనే అంతా దృష్టి పెట్టారు.
తదుపరి ముఖ్యమంత్రి లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ జరిగింది. పన్నీరు సెల్వం అవుతారని, ఆయనకు 135 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారని ప్రచారం కూడా జరిగింది. అయితే, భేటీలో మాత్రం ఆయనకు అంతా రివర్స్ అయింది.

తదుపరి సీఎం లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వంకు పూర్తిస్థాయి మద్దతు లభించలేదు. ఆయన అభ్యర్థిత్వానికి కొందరు వ్యతిరేకత చూపారని తెలుస్తోంది. దీంతో మరోసారి భేటీ కావాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఎమ్మెల్యేల భేటీ ముగిసిన అనంతరం అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ముఖ్య నేతలు భేటీ అయ్యారు.
ఇదిలా ఉండగా తమిళనాడులో శాంతిభద్రతలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ముందు జాగ్రత్తగా చెన్నైలో హై అలర్డ్ కొనసాగిస్తున్నారు. అపోలో ఆసుపత్రి పరిసరాల్లో మొబైల్ ఫోన్ సిగ్నల్స్ నిలిచిపోయాయి.
కేంద్రం జయ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. ఈసీఎంవోతో జయలలితకు వైద్యం కొనసాగిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎయిమ్స్, అపోలో వైద్యులు జయకు వైద్యసేవలు కొనసాగిస్తుండగా. మరోవైపు లండన్ వైద్య నిపుణుడు రిచర్డ్ బాలో పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications