జయలలితపై తీవ్ర ఒత్తిడి: తెరపైకి 'డిప్యూటీ', రేసులో వీరే
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనారోగ్యం బారిన పడడం, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొంతకాలం అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తెరపైకి ఉప ముఖ్యమంత్రి పదవిని రంగంలోకి తీసుకురానున్నారని అంటున్నారు.
పార్టీ నిర్వహణ, పాలనా పరమైన సమస్యలు, ప్రత్యర్థుల కట్టడి.. ఇలా ఎన్నో అంశాల విషయమై జయలలిత తీవర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ఆరోగ్యరీత్యా ఆమె ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పదవి తెరపైకి వచ్చింది.

జయలలిత ఆసుపత్రిలో చేరిన రెండు మూడు రోజులకే పాలనా పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై తేల్చేందుకు ఉప ముఖ్యమంత్రిని నియమించే అంశంపై పార్టీలో చర్చ జరిగింది. కానీ ఆ తర్వాత అది పక్కకు పోయింది. కానీ పాలనాపరమైన ఇబ్బందులు లేకుండా పలువురు చూసుకుంటున్నారు.
ఇప్పుడు జయలలిత కోలుకుంటున్నారు. కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా కొంత విశ్రాంతి అవసరం. దీంతో ఆమెకు ఉపముఖ్యమంత్రి పదవి ఉంటే బాగుంటుందని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి రేసులో ప్రజాపనులశాఖ మంత్రి ఎడప్పాడి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వంల పేర్లు వినవస్తున్నాయి.
ఎయిమ్స్ డాక్టర్లు కూడా
జయలలితకు లండన్ వైద్యులు రిచర్డ్ బాలే నేతృత్వంలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నాడు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు కూడా చెన్నై వచ్చారని తెలుస్తోంది. జయలలితకు చికిత్సలో వారు కూడా తోడ్పాటు అందిస్తారు. ముగ్గురు వైద్యులు వచ్చారని సమాచారం. వచ్చిన ముగ్గురిలో.. ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు, హృద్రోగ నిపుణుడు, మత్తు వైద్య నిపుణుడు ఉన్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications