ఫ్లైట్ క్రాష్ బాధిత కుటుంబాలకు ఎయిర్ ఇండియా బెదిరింపులు ? ఎయిర్ లైనర్ క్లారిటీ..!
గత నెలలో గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా 171 బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటు విమానం కూలిపోయిన హాస్టల్లో ఉన్న దాదాపు పాతిక మంది మెడికల్ విద్యార్దులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనతో ఉలిక్కిపడ్డ ఎయిర్ ఇండియా బాధితుల కుటుంబాలకు వచ్చే ఇన్సూరెన్స్, ప్రభుత్వ సాయాలకు అదనంగా కోటి రూపాయలు ప్రత్యేక పరిహారం ప్రకటించింది. అయితే దాన్ని ఇప్పటికీ వారికి అందించలేదు.
అయితే తాజాగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ బాధిత కుటుంబాలు తమకు కోటి రూపాయల పరిహారం అందించే విషయంలో ఎయిర్ లైనర్ బెదిరిస్తోందని సంచలన ఆరోపణలు చేసారు. దాదాపు 40 బాధిత కుటుంబాలు ఇలా ఎయిర్ ఇండియాపై ఆరోపణలు చేశారు. ఎయిర్ ఇండియా పరిహారం అందించేందుకు తమ ఆర్ధిక పరిస్దితి, ఇతర వివరాలు అడుగుతోందని, ఇవి సమర్పించకపోతే పరిహారం ఇవ్వనంటోందని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బాధిత కుటుంబాలకు ఇచ్చే పరిహార చెల్లింపులను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మరణించిన వారి కుటుంబ సభ్యునిపై తాము ఆర్థికంగా ఆధారపడి ఉన్నామని వెల్లడించే పత్రాలపై సంతకం చేయమని ఎయిర్ ఇండియా బలవంతం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. తాము ఇచ్చిన ప్రశ్నావళిపై సంతకాలు చేయకపోతే పరిహారం రాదని బెదిరిస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. దీంతో ఎయిర్ ఇండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే బాధిత కుటుంబాల బెదిరింపు ఆరోపణల్ని ఎయిర్ ఇండియా తోసిపుచ్చింది. అవి నిరాధారమైనవని, తప్పుడు ఆరోపణలు అని తోసిపుచ్చింది.ఈ మేరకు ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. కుటుంబ సంబంధాలను ఏర్పరచుకోవడానికి, "అర్హత ఉన్నవారికి" చెల్లింపులు అందేలా చూసుకోవడానికి పరిహార గ్రహీతల నుండి ప్రాథమిక సమాచారం మాత్రమే కోరినట్లు పేర్కొంది. సాయం అవసరమైన వారికి చేయడం అనేది న్యాయపరంగా అవసరమని, అందుకే మరణించిన వ్యక్తిపై ఆర్థికంగా ఆధారపడటం గురించి ప్రశ్నించినట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications