ఆడబిడ్డల బట్టలు చింపుతారా- నిండు సభలో అఖిలేష్ నిప్పులు
నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పటికే దేశ రాజధాని అట్టుడికిపోతోందీ విషయంలో. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా ఉండటంతో అటు ప్రతిపక్షాలు సైతం కత్తి దూస్తోన్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించడానికి విఫలయత్నం చేసింది. ఈ ఘటనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత వారిని పోలీసులు విడుదల చేశారు.
ఈ పరిణామాలు లోక్ సభలో ప్రకంపనలు రేపింది. విద్యార్థుల సమస్యపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల అంశం కాంగ్రెస్, బీజేపీ లేదా సమాజ్ వాదీ పార్టీ ఇళ్లకు పరిమితమైనది కాదని, దేశంలోని కోట్ల మంది విద్యార్థులు, యువత భవిష్యత్తుకు సంబంధించినదని ఆయన స్పష్టం చేశారు.

పేపర్ లీకేజీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. సభలో ప్రతిపక్షాల గొంతుకను సరిగ్గా వినకపోతే, రోడ్లపైకి వచ్చి పోరాడటం తప్ప మరో మార్గం ఉండదని హెచ్చరించారు. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, మహిళా విద్యార్థినులను ఈడ్చుకెళ్లడం వంటి అమానవీయ చర్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరును ఆయన ఎండగట్టారు.
విద్యార్థుల కోసం తామందరం పోరాడుతున్నామని, వాళ్ల సమస్యలు వినకపోతే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయని అఖిలేష్ పేర్కొన్నారు. లాఠీఛార్జీ చేయడాన్ని తప్పుపట్టారాయాన. తమ గొంతుకను వినిపించడానికి రోడ్డెక్కిన విద్యార్థుల కాళ్లు చెతులు విరగ్గొట్టారని, తలలు పగులగొట్టారని గుర్తు చేశారు. ఆడపిల్లల బట్టలు చింపారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా మీరు చేస్తారా? అని స్పీకర్ ను ఉద్దేశించి నిలదీశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద బైఠాయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ కు ఎక్కువ సమయం పాటు మాట్లాడే అవకాశం ఇవ్వడం పట్ల అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యులు కూర్చున్న వైపు వేలెత్తి చూపుతూ వారితో ఏవైనా లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకున్నారా? అని స్పీకర్ ను ప్రశ్నించారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ పదే పదే అడుగుతున్నప్పటికీ.. పట్టించుకోకుండా వారితో (కాంగ్రెస్) మాట్లాడించడం సమంజసం కాదని చెప్పారు.












Click it and Unblock the Notifications