గూగుల్ పే యూజర్లకు అలర్ట్: ఆ యాప్స్ ఉపయోగించవద్దంటూ గూగుల్ సూచన
న్యూఢిల్లీ: గూగుల్ పే (Google Pay) తన వినియోగదారుల కోసం కీలక సూచనలు చేసింది. భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ కోసం అధికంగా ఉయోగించే యూపీఐ యాప్‌ల జాబితాలో గూగుల్ పే కూడా ఉన్న విషయం తెలిసిందే. గూగుల్ పే ద్వారా లావాదేవీలు చేసే సమయంలో ఫోన్‌లో స్క్రీన్ షేరింగ్ యాప్(Screen Sharing App)లను ఉపయోగించవద్దని, వాటిని ఓపెన్ చేసి ఉంచొద్దని గూగుల్ సూచించింది.
ఈ యాప్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు యూజర్ల మొబైల్‌లోని గూగుల్ పే యాప్ నుంచి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించి బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నట్లు గుర్తించి ఈ సూచన చేసింది. యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా.. మోసపూరిత లావాదేవీలు జరగకుండా అడ్డుకునేందుకు కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తున్నామని తెలిపింది.

గూగుల్ యాప్ ద్వారా జరిగే లావాదేవీల్లో సైబర్ నేరాల కట్టడికి తమవంతు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. యూజర్లు కూడా తమ వంతుగా కొన్ని సూచనలు పాటించాలని కోరింది. యాప్ ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు ఫోన్లో ఉన్న స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఉపయోగించవద్దని స్పష్టం చేసింది.
థర్డ్ పార్టీ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోమని గూగుల్ పే యూజర్లను కోరదని వెల్లడించింది. ఒకవేళ గూగుల్ పే ప్రతినిధిగా చెబుతూ.. థర్డ్ పార్టీ యాప్ లను ఇన్‌స్టాల్ చేసుకోమని సూచించినా.. వాటిని నమ్మొద్దని తేల్చి చెప్పింది. దీనిపై వెంటనే గూగుల్ పేకు ఫిర్యాదు చేయాలని గూగుల్ వినియోగదారులకు సూచించింది.
గూగుల్ పేతో స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఎందుకు ఉపయోగించొద్దంటే?
సైబర్ మోసగాళ్లు ఈ యాప్‌లను ఉపయోగించి.. మీ తరపున లావాదేవీలు చేయడానికి మీ డివైజ్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు.
అంతేగాక, మీ డెబిట్ కార్డు వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది.
మీ ఫోన్‌కు పంపిన ఓటీపీని చూసి.. మీ ఖాతా నుంచి డబ్బులు బదిలీ చేసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications