భక్తులకు అలర్ట్.. అమర్‌నాథ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత..
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. హిమాలయాల్లో కొలువైన అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జూన్ 29 వ తేదీన ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు రోజూ వేలాది మంది భక్తులు వస్తున్నారు. అయితే, అకాల వర్షాలు కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాదితో పోల్చితే ఈసారి భక్తుల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. యాత్ర ప్రారంభమయిన వారం రోజుల్లోనే లక్షన్నర మంది యాత్రికుల కంటే ఎక్కువ మంది అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నట్లు అధికారులు చెప్పారు. అమర్‌నాథ్ యాత్ర గత నెల 29 వ తేదీన ప్రారంభమయ్యింది. ఆగస్టు 19న యాత్ర ముగుస్తుంది. అయితే, జులై 4 వ తేదీ వరకు కేవలం 6 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1,30,260 మంది భక్తులు అమర్‌నాథుని దర్శనం చేసుకున్నారు.

ఒక్క గురువారం రోజే ఏకంగా 24 వేల మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, బుధవారం 30 వేల మందికి పైగా భక్తులు అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక, నేడు (శనివారం) ఇక్కడ భారీ వర్షాలు పడే అవకాశం లేదని, అయితే అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. అయితే ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అధికారులు యాత్రను నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
రెండు మార్గాల్లో యాత్ర నిలిపివేత..
రెండు మార్గాల్లోనూ అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అమర్‌నాథ్ ఆలయ గుహ, శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రత గరిష్టంగా 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని ఐఎండీ హెచ్చరించింది. ఇక రాగల 4 రోజులలో పెద్ద వర్షపాతం ఉండదని, అయితే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications