వారికి ఇదే చివరి మంత్రివర్గ భేటీ..?!- కిషన్ రెడ్డి స్థానంలో
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. వరుసగా మూడోసారి కూడా విజయకేతనాన్ని ఎగురవేయాలనే లక్ష్యంతో ఉంది బీజేపీ- ఎన్డీఏ. ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను- సెమీ ఫైనల్స్‌గా భావిస్తోంది బీజేపీ అధిష్ఠానం.
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో పార్టీపరంగా కీలక మార్పులు చేసింది. పార్టీ అధ్యక్షులను మార్చేసింది. ఆయా రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులను పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీలో చోటు కల్పించింది.

సార్వత్రిక ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- ప్రధాని మోదీ తన టీమ్‌ను రూపొందించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. దీనిపై ఇప్పటికే ఆయన దృష్టి సారించారు కూడా. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు పూనుకున్నారు. ఈ నెల 12వ తేదీన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చంటూ ఇప్పటికే వార్తలు సైతం వచ్చాయి.
ఈ పరిణామాల మధ్య కేంద్ర మంత్రివర్గం- బుధవారం ఢిల్లీలో భేటీ కాబోతోంది. ప్రధాని మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చంటూ వార్తలు వెలువడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర మంత్రివర్గం భేటీ కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొందరు మంత్రులకు ఇదే చివరి కేబినెట్ సమావేశం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్న నేపథ్యంలో ఆయన ఫ్లైట్ ఎక్కడానికి ముందే పునర్వ్యవస్థీకరణ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. శాఖల కేటాయింపుపై ఇప్పటికే కసరత్తు పూర్తయిందనీ అంటున్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, భూపేంద్ర యాదవ్ తదితరులు.. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. వారిని మంత్రివర్గం నుంచి తప్పించి.. పార్టీ బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం దేశ రాజధానిలో జోరుగా సాగుతోంది.
తెలంగాణ నుంచి ఇప్పటివరకు కేంద్ర కేబినెట్‌కు ప్రాతినిథ్యాన్ని వహించిన జీ కిషన్ రెడ్డి.. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ఖాయమైంది. కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ నుంచి బండి సంజయ్‌కు కేబినెట్‌లో చోటు దక్కుతుందని అంటున్నారు. రెండో ప్రాధాన్యతలో డాక్టర్ కే లక్ష్మణ్ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications