తమిళనాడు పీసీసీ హెడ్ క్వార్టర్ లో షర్మిల- భర్త అనిల్ ను వెంటబెట్టుకుని మరీ.. !!
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెన్నైలో ప్రత్యక్షం అయ్యారు. ఇక్కడి తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌ను సందర్శించారు. తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు మాణిక్కం ఠాగూర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర పీసీసీ నాయకులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో ఆమె వెంట బ్రదర్ అనిల్ ఉన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు జాతీయ స్థాయి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
అనంతరం వైఎస్ షర్మిల.. మాణిక్కం ఠాగూర్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పనితీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన సారథ్యంలోని బీజేపీ.. జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థలన్నింటినీ కూడా తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం గుప్పిట్లోకి తీసుకుంటోన్నాయని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీ నియంత్రిస్తోన్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

దేశంలో ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన విలువ, గౌరవాన్ని ఇచ్చేది ఓటు హక్కు మాత్రమేనని షర్మిల స్పష్టం చేశారు. ఈ ఓటు హక్కును రక్షించుకోలేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థే పూర్తిగా కూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును కాపాడుకోవడం అనేది.. ప్రజాస్వామ్యానికి, దేశ భవిష్యత్తుకు అత్యవసరమని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి గురించి షర్మిల మాట్లాడారు.
సాధారణంగా ఎన్నికల కమిషన్‌లో జరిగే ప్రతి నిర్ణయం ముగ్గురు కమిషనర్ల ఏకాభిప్రాయంతో గానీ, కనీసం ఇద్దరు కమిషనర్ల మెజారీటీతో గానీ తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. జ్ఞానేష్ కుమార్ మాత్రం తన సహచర కమిషనర్ల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా, ఏకపక్షంగా సుమారు 14 కీలక ఉత్తర్వులను జారీ చేయడం అంటే.. ఆయనను ఎవరు నియంత్రిస్తోన్నారు, ఎవరి మాట వింటోన్నారనేది అర్థం చేసుకోవచ్చని షర్మిల చెప్పారు.
ముగ్గురు సభ్యులు ఉండే రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘంలో సహచర కమిషనర్ల సమ్మతి, వారి ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే వ్యవస్థలను ఏ స్థాయికి దిగజార్చారో అర్థమవుతోందని షర్మిల విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను, స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి స్వతంత్ర వ్యవస్థలను మోదీ ప్రభుత్వం తమ గుప్పిట్లో పెట్టుకుందని, ఇప్పుడు అదే రీతిలో ఎన్నికల సంఘాన్ని కూడా పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటువంటి పరిణామాలు దేశంలో ఇలాగే కొనసాగితే అత్యున్నతమైన భారత రాజ్యాంగ మనుగడకే తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఇటువంటి ప్రతికూల చర్యలపై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు గళమెత్తాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె విజ్ఞప్తి చేశారు. మన రాజ్యాంగ మూలాలను కాపాడుకోవడానికి ఇది ఎంతో కీలకమైన సమయమని వ్యాఖ్యానించారు.













Click it and Unblock the Notifications
