ధన్‌తెరాస్ నాడు బంగారంలాంటి వార్త
Dhanteras 2024: దీపావళి పండగ సమీపించింది. గురువారం నాడు దేశవ్యాప్తంగా దీవాళీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు ప్రజలు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య బాణాసంచా కాల్చుతూ సందడి చేయడానికి సిద్ధమౌతున్నారు.
వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో మూడు రోజుల పాటు ఈ పండగను జరుపుకుంటుంటారు. ఛోటీ దీపావళి, మహాలక్ష్మి వ్రతం, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వంటి శుభ కార్యాలను నిర్వహిస్తుంటారు. తోడబుట్టిన వాళ్ల క్షేమాన్ని కోరుకుంటూ భాయ్ దూజ్‌ను జరుపుకొనే సంప్రదాయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది.

దీపావళి సమయంలో ధన్‌తేరాస్‌ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మహాలక్ష్మి, ధన్వంతరికి పూజలు చేస్తారు. దీపాలను వెలగించి ఆరాధిస్తారు. అదే రోజున బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ధన్‌తెరాస్ నాడు బంగారాన్ని కొనడం అదృష్టానికి సంకేతమని విశ్వసిస్తారు.
ఈ పరిణామాల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం లాంటి సమాచారం ఇచ్చింది. తమ వద్ద 855 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ చివరి నాటికి బంగారం నిల్వలు మొత్తంగా 854.72 మెట్రిక్ టన్నులకు చేరినట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
దేశీయంగా 510.46 మెట్రిక్ టన్నల బంగారం నిల్వలు ఉండగా.. మిగిలిన 324.01 మెట్రిక్ టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ వద్ద డిపాజిట్‌గా ఉన్నట్లు తెలిపింది. మరో 20.26 మెట్రిక్ టన్నుల డిపాజిట్లను లిక్విడిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీల కోసం కేటాయించినట్లు ఆర్బీఐ వివరించింది.
ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన గత ఆర్థిక సంవత్సరం నాటికి 8.15 శాతం మేర బంగారం నిల్వలు ఉండగా.. సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 9.32 శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులు నెలకొన్నప్పటికీ- తమ వద్ద బంగారం నిల్వలు భారీగా పెరిగినట్లు ఆర్బీఐ పేర్కొంది.












Click it and Unblock the Notifications