బెంగళూర్ రేప్: ఒక్కరి అరెస్టు, తెరుచుకున్న స్కూల్
బెంగళూర్: మూడేళ్ల బాలికపై అత్యాచారం వివాదం నేపథ్యంలో మూతపడిన బెంగళూర్‌లోని పాఠశాల సోమవారం తెరుచుకుంది. మూడేళ్ల బాలికపై అక్టోబర్ 21వ తేదీన అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. బాలిక తల్లిదండ్రులు జరిగిన ఉదంతంపై ఫిర్యాదు చేసినప్పటి నుంచి పాఠశాల నడవడం లేదు.
బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు శనివారంనాడు పురోగతి సాధించారు. దర్యాప్తులో బాలిక గుర్తు పట్టడంతో పోలీసులు గుండప్పను అరెస్టు చేశారు. ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫీస్ అసిస్టెంట్ గుండప్పను (45)ను అరెస్టు చేశామని, దర్యాప్తు సందర్భంగా ఫొటో చూసి బాలిక అతన్ని గుర్తుపట్టిందని బెంగళూర్ పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.

గత రెండేళ్లుగా అతను పాఠశాలలో పనిచేస్తున్నట్లు యాజమాన్యం నుంచి పోలీసులు తెలుసుకున్నారు. ప్రత్యేకమైన ఏజెన్సీ ద్వారా నిందితుడి గుర్తింపు ప్రక్రియ పిక్చర్ ద్వారా జరిగిందని, మెజిస్ట్రేట్ ముందు బాలిక వాంగ్మూలం నమోదు చేశామని రెడ్డి చెప్పారు.
తీవ్రమైన బాధ నుంచి కోలుకోలేదని, బాలిక చాలా చిన్నదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బాలిక నుంచి ఎక్కువ సమాచారం సేకరించలేదని ఆయన చెప్పారు. ఇది అత్యంత సున్నితమైన కేసు అని, బాధితురాలి నుంచి ఎక్కువ సాక్ష్యాలు సేకరించలేకపోయామని ఆయన అన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున, కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ వివరాలు వెల్లడించలేమని ఆయన చెప్పారు.
పిల్లల భద్రతకు, రక్షణకు రెడ్డి తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన తర్వాత సోమవారం నుంచి పాఠశాల నడవడానికి పోలీసులు అనుమతించారు. పాఠశాల కార్యదర్శి కెఆర్‌కె రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాల సొసైటీకి చెందిన మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఆ ముగ్గురికి కూడా విచారణ నిమిత్తం సమన్లు జారీ చేసినట్లు పోలీసు కమిషనర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి సరైన గుర్తింపు లేకుండా నడుపుతున్నట్లు వారిపై ఆరోపణలు వచ్చాయని రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications