సెటిల్ మెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న సీఐ మీద కేసు నమోదు చేసిన పోలీసులు !
బెంగళూరు: భూ వివాదంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలపై బెంగళూరు సిటీలోని పులికేశీ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పీబీ కిరణ్ తో సహా ముగ్గురిపై బెంగళూరులోని అశోకనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఏడేళ్ల క్రితం హరీష్ ఫెర్నాండెజ్, వసంత్ ఫెర్నాండెజ్ సోదరుల మధ్య ఇంటి అద్దె విషయంలో గొడవ జరిగింది. ఇన్‌స్పెక్టర్ కిరణ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని, హరీష్‌పై చర్యలు తీసుకున్నారని బాధితులు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశం మేరకు కిరణ్, వసంత్ ఫెర్నాండెజ్, మరిట్టా ఫెర్నాండెజ్‌లపై కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. నగరంలోని రిచ్‌మండ్‌టౌన్ సమీపంలోని ఆల్బర్ట్ స్ట్రీట్‌లో వారసత్వంగా వచ్చిన ఇంటి విషయంలో సోదరులు హరీష్ ఫెర్నాండెజ్, వసంత్ ఫెర్నాండెజ్ మధ్య వివాదం జరిగింది. 2016లో ఇల్లు ఖాళీ చేయాలని అన్నదమ్ములు ఒకరితో ఒకరు గొడవపడి చివరకు అశోకనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు.
అప్పుడు ఈ వివాదంలో జోక్యం చేసుకున్న సీఐ కిరణ్ ఆ సోదరుల్లో వసంత్‌కు అనుకూలంగా వ్యవహరించారు.
2016 డిసెంబర్ 13వ తేదీన వసంతతో కలిసి కిరణ్ హరీష్ ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. కోర్టు వారెంట్ ఆధారంగా కిరణ్ ఇంట్లోకి చొరబడి మమ్మల్ని బెదిరించాడని బాధితులు ఆరోపించారు. సీఐ కిరణ్ మా ఇంట్ో అద్దెదారులను కూడా బెదిరించాడని, కిరణ్ మా ఇంట్లో రూ. 22 వేల రూపాయలు దోపిడీ చేశాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వివాదానికి సంబంధించి సీఐ కిరణ్, వసంత్‌తో పాటు మరికొందరిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హరీష్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును విచారించిన న్యాయస్థానం కేసు దర్యాప్తునకు ఆదేశించింది. దీని ప్రకారం సీఐ కిరణ్, వసంత్‌తో పాటు మరికొందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
అయితే కోర్టు ఆదేశాల మేరకు సీఐ కిరణ్ మీద కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మరోసారి పాత కేసులు అన్ని తెర మీదకు వస్తున్నాయి. గత బీజేపీ ప్రభుత్వంలో కేసులు పెట్టి పోలీసుల తీరుతో విసిగిపోయి సైలెంట్ అయిన కొందరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మరో సారి పోలీసు కేసులు పెట్టడానికి సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications