దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'భన్వరీదేవి' కేసులో కీలక అరెస్టు
జోథ్ పూర్: ఒకప్పటి రాజస్తాన్ మంత్రి మహిపాల్ మాదేర్నాతో అక్రమ సంబంధం నెరిపి.. ఆపై అనుమానాస్పద రీతిలో మరణించిన భన్వరీ దేవీ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఇందిరా బిష్ణోయ్ ను రాజస్తాన్ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు.
భన్వరీదేవి కిడ్నాప్, హత్య కేసులో ఇందిరా బిష్ణోయ్ సహ నిందితురాలుగా ఉన్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్కాన్ బిష్ణోయ్ సోదరి అయిన ఇందిరా బిష్ణోయ్ ను మధ్యప్రదేశ్ లోని దేవాస్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఆమెను జోధ్ పూర్ తీసుకెళ్లి.. అక్కడి సీబీఐ అధికారులకు అప్పగించారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా.. ఇందిరా బిష్ణోయ్ ఆచూకీ తెలిపినవారికి రూ.5లక్షలు ఇస్తామని గతంలో ఏటీఎస్ ప్రకటించింది.
హత్య జరిగిందిలా!:
రాజస్తాన్ కు చెందిన భన్వరీదేవి(36) అనే నర్సు జోద్ పూర్ బిలారా ప్రాంతం నుంచి అపహరణకు గురైనట్లు 2011,సెప్టెంబర్1న ఫిర్యాదు నమోదైంది. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. భన్వరీదేవిని హత్య చేశారని తేలింది. హత్యానంతరం జలోదాలో ఆమెను తగలబెట్టి ఆనవాళ్లు మాయం చేసినట్లు తెలిసింది. అస్థికలను రాజీవ్ గాంధీ లెఫ్ట్ కెనాల్ లో కలిపినట్లు గుర్తించారు.

మంత్రితో అక్రమ సంబంధం:
భన్వరీదేవి హత్య కేసులో రాజస్తాన్ మంత్రికి మహిపాల్ మాదేర్నాకు లింకు ఉండటంతో.. దేశవ్యాప్తంగా ఈ హత్య సంచలనంగా మారింది. విచారణలో మహిపాల్ మాదేర్నా సహా ఎమ్మెల్యే మల్కాన్ బిష్ణోయ్, కాంగ్రెస్ నేత సాహిరాం బిష్ణోయ్ నేరం అంగీకరించారు.
మహిపాల్ తో భన్వరీదేవికి అక్రమ సంబంధం ఉండటం.. వీరిద్దరు ఏకాంతంగా గడిపిన దృశ్యాలను లీక్ చేస్తానని భన్వరీ బ్లాక్ మెయిలింగ్ కు దిగడంతోనే ఆమెను హత్య చేశారు. మల్యాన్, సాహిరాం సహాయంతో మహిపాల్ ఈ హత్యకు పాల్పడ్డారు. కోర్టు జోక్యంతో అప్పటి సీఎం అశోక్ గెహ్లాట్ మహిపాల్ ను మంత్రిపదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత కేసును సీబీఐకి అప్పగించారు.
ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇప్పటికి రెండు చార్జీషీట్లు దాఖలు చేయగా.. అమర్ చంద్, ఇందిరా బిష్ణోయ్ సహా మొత్తం 13మందిని నిందితులుగా పేర్కొంది. ఇందులో భాగంగానే తాజాగా ఇందిరా బిష్ణోయ్ అరెస్టు చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications