ఇది కదా కావాల్సింది..!!
బెంగళూరు: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిరాటంకంగా కొనసాగుతుంది. కిందటి నెల 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి వద్ద భారత్ జోడో యాత్ర ఇవ్వాళ్టికి 26వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర చేస్తూ కేరళ మీదుగా కర్ణాటకలో ప్రవేశించారు రాహుల్ గాంధీ. భారతీయ జనత పార్టీ పాలనలో ఉన్న కర్ణాటకలో సుదీర్ఘంగా సాగనుందీ యాత్ర.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు..
21 రోజుల పాటు ఈ రాష్ట్రంలోనే ఉండబోతోన్నారు రాహుల్ గాంధీ. 511 కిలోమీటర్ల మేర కాలినడకన నడవనున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడానికి సహకరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అదే సమయంలో- ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా కర్ణాటకలోనే జోడో యాత్రలో భాగస్వామ్యులు కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంచనాలకు తగ్గట్టుగా..
ఇప్పటివరకు ఈ యాత్రలో సోనియా గాంధీ గానీ, ప్రియాంక గాంధీ గానీ పాల్గొనలేదు. దీనికి భిన్నంగా ముగ్గురు గాంధీలు భారత్ జోడోలో కనిపించనున్నారు. కేరళతో సరిహద్దులను పంచుకుంటోన్న చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటెలో కిందటి నెల 30వ తేదీన అడుగు పెట్టారు రాహుల్ గాంధీ. భారీ వర్షంలోనూ ఆయన యాత్ర కొనసాగుతోంది. అంచనాలకు తగ్గట్టుగానే ఆయన ఈ యాత్రకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు చెబుతున్నారు.
భారీ వర్షంలో..
సోమవారం రాత్రి మైసూరులో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్ గాంధీ. మైసూరుకు సమీపించిన కొద్దిసేపటికే ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ఆ తరువాత కొద్దిసేపు తెరపినిచ్చింది. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో మళ్లీ వర్షం పడింది. అయినా లెక్క చేయలేదు. తడుస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. వర్షానికి తడవకుండా సభకు హాజరైన వారు కుర్చీలను తలపై పెట్టుకుని మరీ- రాహుల్ గాంధీ ప్రసంగాన్ని విన్నారు.
డీఎన్ఏలో..
భారత్‌ను ఏకం చేయడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తలపెట్టిన తన యాత్రను ఎవరూ అడ్డుకోలేరని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రేమ, సోదరభావం భారత డీఎన్‌ఏలో ఉందని, ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా కొందరు చేస్తోన్న ఈ ప్రయత్నాలు తాత్కాలికమేనని తేల్చి చెప్పారు. దేశం యావత్తూ ఇప్పుడు ఒకే తాటిపైన నడవడానికి సంసిద్ధంగా ఉందని, దీన్ని ఎవరూ, ఎలాంటి ప్రయత్నాలు చేసినా విడదీయలేరని తేల్చి చెప్పారు.
కమిట్‌మెంట్..
భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం.. నెటిజన్లను ఆకట్టుకుంది. ఇలాంటి కమిట్‌మెంట్‌నే తాము రాహుల్ గాంధీ నుంచి ఆశించామని స్పష్టం చేస్తోన్నారు కాంగ్రెస్ అభిమానులు. వర్షంలో తడుస్తూ రాహుల్ గాంధీ ప్రసంగిస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి జైరామ్ రమేష్, తెలంగాణ కాంగ్రెస్ ఈ వీడియోను ట్వీట్ చేశాయి.












Click it and Unblock the Notifications