వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైడెన్-పుతిన్ సమావేశం: అమెరికా నుంచి రష్యా ఏం కోరుకుంటోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జో బైడెన్-వ్లాదిమిర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జెనీవాలో సమావేశమయ్యారు. అయితే ఇది ఇద్దరు మిత్రుల మధ్య జరుగుతున్న సమావేశం కాదు.

అమెరికా, రష్యా సంబంధాలలో పెరుగుతున్న అగాథమే ఈ సమావేశానికి ప్రధాన కారణం. తమ మధ్య సంబంధాలు ఎప్పుడో దెబ్బతిన్నాయని ఇరుదేశాలకు తెలుసు.

అమెరికాను తన మిత్రుల జాబితా నుంచి రష్యా తొలగించింది. రెండు దేశాలు అధికారికంగా స్నేహంగా ఉంటున్నట్లు కనిపిస్తాయి. కానీ, అమెరికాలో రష్యా రాయబారిగానీ, రష్యాలో అమెరికా రాయబారిగానీ లేరు.

యుక్రెయిన్‌లోని క్రిమియాను స్వాధీనం చేసుకోవడం, అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో రష్యాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది.

అలాగే అమెరికాకు చెందిన ఇద్దరు నౌకాదళ అధికారులు ఇప్పుడు రష్యా జైలులో ఉన్నారు. వారిలో ఒకరు గూఢచర్యం కేసులో 16 సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నారు.

అంతేకాదు, ఈ ఏడాది మార్చిలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కిల్లర్‌గా అభివర్ణించారు.

ఈ నేపథ్యంలో బైడెన్, పుతిన్‌ల మధ్య జరుగుతున్న తొలి సమావేశం ఇది.

జూన్ 16న జెనీవాలోని గ్రాండ్ విల్లా గ్రాంజేలో సమావేశం జరగబోతోంది

ఈ సమావేశం ఎందుకు అంత కీలకం?

''ఈ సమావేశం అమెరికా, రష్యాల మధ్య సమాన హోదాకు సంకేతంగా నిలుస్తుంది'' అని అన్నారు ఆండ్రీ కొర్ట్‌నేవ్. ఆయన రష్యాలోని ఆర్ఐఏసీ థింక్‌ట్యాంక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

సోమవారంనాడు జో బైడెన్ బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో జరిగే వివిధ సమావేశాలలో పాల్గొంటారు.

అయితే బుధవారం నాడు పుతిన్, బైడెన్‌ల మధ్య జరిగే సమావేశంపైనే అందరి దృష్టి నిలిచింది.

''రష్యా అధ్యక్షుడు పుతిన్ తాను అమెరికా అధినేతకు సాటి అయిన వ్యక్తిగా నిలబడాలని కోరుకుంటారు'' అని ఆండ్రీ కొర్ట్‌నేవ్ అన్నారు.

రొనాల్డ్ రీగన్, మిఖాయిల్ గోర్బచేవ్ 1985లో జెనీవాలో సమావేశం అయ్యారు

చరిత్ర..ఆకాంక్షలు..

సమావేశానికి జెనీవాను ఎంచుకోవడం చూస్తుంటే ప్రచ్ఛన్న యుద్ధంనాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. 1985లో ఇక్కడ అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనల్డ్ రీగన్, సోవియట్ నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్ సమావేశమయ్యారు.

అయితే, బైడెన్-పుతిన్‌ల మధ్య తాజా సమావేశం ఆ స్థాయిలో ఉండబోదనేది సుస్పష్టం. ఎందుకంటే వీరిమధ్య రాజకీయంగా లేదా వ్యక్తిగతంగా ఆ స్థాయి సంబంధాలు లేవు.

రష్యాతో ఊహించదగిన, సుస్థిరమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు అమెరికా చెబుతోంది. అయితే, 2014లో యుక్రెయిన్‌లోని క్రిమియా భూభాగాన్ని ఆక్రమించిన తర్వాత నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయాలను అందరూ గమనించారు.

''ఎవరి సహనం ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుంది. అలాగే చర్చలన్నీ పైపైనే ఉంటాయి'' అని రాజకీయ విశ్లేషకుడు లిలియా షెవ్‌ట్సోవా అన్నారు.

''వారిద్దరూ మాట్లాడుకోకపోతే, రష్యా తీసుకునే చర్యలు ఊహించని విధంగా ఉంటాయి'' అన్నారాయన.

బైడెన్, పుతిన్

విజయవంతం అవుతుందా?

గత వారం రష్యా ప్రభుత్వ టీవీ ఛానెల్‌లో పుతిన్ మాట్లాడారు.

''సిరియా, లిబియాల్లో ప్రాంతీయ ఘర్షణలకు కళ్లెం, అణ్వాయుధాల నియంత్రణ, వాతావరణ మార్పులపై రెండు దేశాలు కలిసి పనిచేయొచ్చు'' అని అన్నారు.

''ఈ అంశాలపై పనిచేసేందుకు అనువైన పరిస్థితులు ఏర్పాటు చేయగలిగితే, ఆ సమావేశం వృథాకాదు'' అన్నారు పుతిన్.

దౌత్యపరమైన విభేదాల విషయంలోనూ సంధి కుదిరే అవకాశముందని కొందరు రష్యా నిపుణులు అంటున్నారు. డజన్ల మంది రష్యా దౌత్యవేత్తల్ని అమెరికా దేశం నుంచి బహిష్కరించింది.

రష్యాలోని రెండు రాయబార కార్యాలయాల్ని కూడా అమెరికా మూసివేసింది. మరోవైపు స్థానికుల్ని విధుల్లోకి తీసుకోకుండా అమెరికా రాయబార కార్యకలయాలపై రష్యా ఆంక్షలు విధించింది.

ఈ సమావేశం తర్వాత రష్యా తమ రాయబారిని మళ్లీ వాషింగ్టన్ వెళ్లేందుకు అనుమతించొచ్చు. రష్యా జైళ్లలో ఉన్న తమ దేశస్తుల గురించి కూడా అమెరికా ప్రస్తావించే అవకాశముంది.

2018లో గూఢచర్య ఆరోపణలపై అరెస్టైన పాల్ వీలన్ ఇప్పుడు రష్యా దగ్గరే ఉన్నారు. అయితే, గూఢచర్య ఆరోపణలను పాల్ తిరస్కరిస్తూ వస్తున్నారు.

బందీలను ఇచ్చిపుచ్చుకునే ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను రష్యా ఇటీవల ఇచ్చింది. అయితే, రష్యా విధిస్తున్న షరతులు అమెరికాకు ఆమోదయోగ్యంగా అనిపించడం లేదు.

పశ్చిమ దేశాలను శత్రువులుగా..

పశ్చిమ దేశాలను తమకు శత్రువులుగా ఎప్పటికప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణిస్తున్నారు.

ఇటీవల సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఓ సమావేశంలో మాట్లాడిన పుతిన్, రష్యా అభివృద్ధిని అమెరికా అడ్డుకోవాలని చూస్తోందని అన్నారు.

అంతకు ముందు అయితే, రష్యాను కరవాలని చూసే విదేశీయుల పళ్లు పీకేస్తానని పుతిన్ హెచ్చరించారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా రష్యా శక్తి, సామర్థ్యాలను ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు.

''అమెరికాను ఆయన శత్రువుగానే చూస్తారు. ఆ కోణంలో మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు'' అని రష్యాలోని ఆర్ఐఏసీ థింక్‌ట్యాంక్ డైరెక్టర్‌ కొర్ట్‌నేవ్ అన్నారు.

అయితే, ఈ సమావేశం కోసం రష్యా ఒకటి రెండు మెట్లు దిగి వస్తుందని తాను భావిస్తున్నట్లు కొర్ట్‌నేవ్ చెప్పారు.

జో బైడెన్

పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారు..

'' విరోధంతో కలిగే ప్రతికూల పరిస్థితులేమిటో పుతిన్‌కు తెలుసు. అందుకే వీటిని తగ్గించేందుకు ఆయన కూడా ప్రయత్నిస్తారు'' అని కొర్ట్‌నేవ్ అన్నారు.

ఇటీవల రష్యాపై అమెరికా ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. దీంతో రష్యా ప్రభుత్వానికి మార్కెట్ల నుంచి నిధులు సమకూర్చుకోవడం కష్టమైంది.

వచ్చే ఏడాది రష్యాలో ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇలాంటి ఆంక్షలు మరిన్ని విధిస్తే, పుతిన్‌పై ఒత్తిడి మరింత పెరుగుతుంది.

''దేశంలో ఆర్థిక, సామాజిక పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు..రష్యా ప్రజలు విదేశీ విధానాల్లో విజయాలను చూడరు'' అని ఆర్ఐఏసీ థింక్‌ట్యాంక్ డైరెక్టర్‌ కొర్ట్‌నేవ్ వ్యాఖ్యానించారు.

''పుతిన్ ఏదైనా అనుకోవచ్చు..పరిస్థితుల్ని దిగజార్చడం ద్వారా దేశీయంగా ఆయన పొందే లాభమేమీ ఉండదు'' అన్నారాయన.

అలెక్సీ నావల్నీ

సందేశాలు వద్దు..

ముఖ్యంగా మానవ హక్కులపై సందేశాలను పుతిన్ వినాలని అనుకోవట్లేదు.

రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీపై విష ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.

నావల్నీ రాజకీయ కార్యాలయాలు, అవినీతి వ్యతిరేక విభాగాలపై 'అతివాద' ముద్రవేసి, వాటిపై రష్యాలోని ఓ కోర్టు నిషేధం విధించింది. ఈ విషయంలో కోర్టు తీర్పును సమావేశం జరిగే వరకూ వాయిదా వేసే అవకాశం ఉంది.

దీని ద్వారా పుతిన్ గట్టి సందేశం పంపాలని అనుకుంటున్నారు. అసమ్మతిని అణచి వేస్తామని, దీనితో అమెరికాకు ఎలాంటి సంబంధమూలేదని ఆయన చెప్పాలని చూస్తున్నారు.

''ఈ విషయంలో మానవ హక్కుల గురించి బైడెన్ చెప్పాల్సింది బైడెన్ చెబుతారు.. అదే విధంగా పుతిన్ చెప్పాల్సింది పుతిన్ చెబుతారు'' అని రాజకీయ విశ్లేషకుడు లిలియా షెవ్‌త్సోవా అన్నారు.

''నిజానికి మానవ హక్కుల ఉల్లంఘనల తర్వాత, ఈ సమావేశం జరుగుతోందంటే..వారు ప్రధాన అంశాలపైనే దృష్టి సారిస్తారని అనుకోవచ్చు. అంటే పరిస్థితులు సద్దుమణగడానికి వారు చర్యలు తీసుకోవచ్చు'' అని షెవ్‌త్సోవా అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Biden-Putin meeting: What Russia really wants from America
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X