అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ సర్కార్ గుడ్ న్యూస్!
Bihar: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర సర్కారు సామాజిక భద్రతా పెన్షన్ స్కీం కింద పింఛన్లను రూ.400 నుంచి రూ.1100కి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
కోటి మందికి పైగా లబ్ధిదారులకు లబ్ధి
బీహార్ రాష్ట్రంలోని వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పింఛను మొత్తాన్ని భారీగా పెంచారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం మాట్లాడుతూ.. సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద పింఛనును రూ.400 నుంచి రూ.1100కి పెంచినట్లు ప్రకటించారు. 2025 చివరి నాటికి బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన పెన్షన్ జులై నెల నుంచి లబ్ధిదారులకు అందనుంది. తదనంతరం ప్రతి నెల 10వ తేదీన వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది.

ఎక్స్ వేదికగా నితీష్ కుమార్ రాసుకొస్తూ.. "సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద వితంతు మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఇప్పుడు నెలకు రూ.400కు బదులుగా రూ.1100 పెన్షన్ పొందుతారని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను" అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రకారం.. పెన్షన్ పెంపు వల్ల కోటి 9 లక్షల 69 వేల 255 మంది లబ్ధిదారులకు సహాయపడుతుంది.
"వృద్ధులు సమాజంలో ఒక విలువైన భాగమని, వారి గౌరవప్రదమైన జీవనాన్ని నిర్ధారించడం మా ప్రాధాన్యత. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను కొనసాగిస్తుంది." అని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications