బెంగాల్ సీఎం రేసులో ఉన్నది వీళ్లే
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ చారిత్రక విజయాన్ని అందుకుంది. 206 సీట్లను గెలుచుకుని బెంగాలీ గడ్డపై అడుగు మోపింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యాన్ని అంతం చేసింది. టీఎంసీ 81 సీట్లకే పరిమితమైంది. మూడు దఫాలుగా గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావాల్సొచ్చింది. బీజేపీ సాధించిన ఈ విజయంతో.. ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఆరంభమైంది.
బెంగాల్ లో బీజేపీ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారకుడు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి. 2021 నాటి ఎన్నికల ముందు వరకూ మమత బెనర్జీకి రైట్ హ్యాండ్ గా ఉంటూ వచ్చాడు సువేందు. ఆమె కేబినెట్ లోనూ పని చేశాడు. ఆ తర్వాత బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి పదవిని ఇస్తామనే బీజేపీ హామీ ఇవ్వడంతో పార్టీ ఫిరాయించాడు. దీంతో.. బెంగాల్ సీఎం రేసులో ఫ్రంట్ రన్నర్ గా నిలిచాడు సువేందు అధికారి.

భవానీపూర్ లో మమతా బెనర్జీని సైతం ఓడించారు. నందిగ్రామ్ లోనూ గెలిచారాయన. ఈ రెండు సీట్లల్లో కూడా భారీ ఆధిక్యాన్ని సాధించారు. దీతో అధికారి రాజకీయ ప్రాబల్యం మరింత పెరిగింది. 2021లో నందిగ్రామ్‌లో మమతను 1,956 ఓట్ల తేడాతో, తాజా ఎన్నికల్లో భవానీపూర్‌లో 15,105 ఓట్ల మెజారిటీతో మట్టకరిపించారు. 2020లో బీజేపీలోకి చేరినప్పటి నుండీ సువేందు ప్రాబల్యం విస్తరించింది. క్షేత్రస్థాయి సమీకరణ, టీఎంసీపై నిరంతర పోరాటం ఇందుకు కారణం.
ముఖ్యమంత్రి పదవికి సువేందు అధికారి మాత్రమే అభ్యర్థి కాదని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సమిక్ భట్టాచార్య, ఉపాధ్యక్షురాలు అగ్నిమిత్ర పాల్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. అగ్నిమిత్ర.. ఈ ఎన్నికల్లో అసన్ సోల్ సౌత్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మమత బెనర్జీ వారసత్వాన్ని కొనసాగిస్తూ మహిళను ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ భావిస్తే అగ్నిమిత్రకు ఆ అవకాశం ఉంటుంది.
బీజేపీ నాయకత్వం త్వరలోనే కోల్‌కతాలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల సమావేశం ఏర్పాటు చేయనుంది. తదుపరి శాసనసభాపక్ష నాయకుడిని లాంఛనంగా ఎన్నుకుంటుంది. ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నా, ఈ ప్రక్రియకు పార్టీ ఇంకా కాలపరిమితిని ప్రకటించలేదు. ఈ నెల 10వ తేదీలోపు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మే 9న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి కావడంతో ఈ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications