అద్దిరిపోయిన స్ట్రైక్ రేట్..!!
Maharashtra Asssembly election results 2024: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. కనీవినీ ఎరుగని అత్యంత భారీ మెజారిటీని సాధించింది. శివసేన (ఏక్‌నాథ్ షిండే)- బీజేపీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) సారథ్యంలోని మహాయుటి కూటమి విజయదుందుభి మోగించింది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. దీన్ని అలవోకగా అందుకుంది మహాయుటి. రాత్రి సమయానికి ఈ కూటమి అభ్యర్థులు 232 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించారు. మరో రెండు చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

ఇది- బీజేపీకి రుచి చూసిన చారిత్రాత్మక విజయం అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. బీజేపీతో పాటు ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పోరాడాయి. శివసేన ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ, కాంగ్రెస్ మహా వికాస్ అఘాడీని మట్టి కరిపించాయి. ఈ తిరుగులేని విజయాన్ని అందుకున్నాయి.
నాలుగు నెలల కిందటే ముగిసిన లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే మహాయుటి కూటమికి వచ్చిన ఓట్లు, పడ్డ ఓట్ల శాతం అత్యధికం. ఇందులో కూడా బీజేపీదే అగ్రస్థానం కూడా. లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఏకంగా 42 శాతం మేర అధిక స్ట్రైక్ రేట్‌ను రికార్డు చేసిందంటే సాధారణ విషయం కాదు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నమోదు చేసిన స్ట్రైక్ రేట్.. 47 శాతం. ఇప్పుడీ సంఖ్య ఏకంగా 89 శాతానికి ఎగబాకింది. అంటే మొత్తం 42 శాతం అధికం అన్నమాట. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) స్ట్రైక్ రేట్ 71 శాతంగా రికార్డయింది. లోక్‌సభతో పోల్చుకుంటే ఈ సంఖ్య 46 శాతం అధికం. ఆ ఎన్నికల్లో ఎన్సీపీకి 25 శాతం స్ట్రైక్ రేట్ దక్కగా.. ఇప్పుడది 71కి చేరింది.
శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) ఓటు శాతం కూడా భారీగా మెరుగుపడింది. లోక్‌సభలో ఈ పార్టీకి 44 శాతం స్ట్రైక్ రేట్ ఉండగా.. ఇప్పుడీ సంఖ్య 70కి పెరిగింది. 26 శాత అధికం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నది మహా వికాస్ అఘాడీ. ఇందులో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా సత్తా చాటలేకపోయింది.
లోక్‌సభ ఎన్నికల్లో శివసేన (ఉద్ధవ్ థాకరే) 45 శాతం స్ట్రైక్ రేట్‌ను అందుకోగా.. ఇప్పుడు 21 శాతానికి దిగజారింది. అలాగే- కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్)లు ఘోరంగా దెబ్బతిన్నాయి. భారీగా ఓట్ల శాతాన్ని కోల్పోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 62, ఎన్సీపీ (ఎస్పీ) 55 శాతం మేర స్ట్రైక్ రేట్ నమోదు చేయగా తాజాగా ఈ సంఖ్య వరుసగా 15, 12గా తేలింది.












Click it and Unblock the Notifications