దేశంలో వరుసగా 12 విమానాలకు బాంబు బెదిరింపులు.. అసలేం జరుగుతోంది?
ఇటీవల కాలంలో వివానాలకు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. తాజాగా మన దేశంలో మరోసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ఈ తరహా బెదింపు కాల్స్ 12 విమానాలకు వచ్చినట్లయింది. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా ప్రయత్రిస్తోన్న విమానయాన సంస్థలకు ఇదో తలనొప్పిగా మారిందని అధికారులు చెబుతున్నారు.
తాజాగా బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూర్‌కి బయలుదేరే ఆకాసా ఎయిర్ విమానంతోపాటు, ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానానికి సైతం బెదిరింపులు కాల్స్ వచ్చినట్లు అధికారులు దృవీకరించారు. కేవలం ఈ రెండు రోజుల్లోనే 12 విమానాలకు నకిలీ బెదిరింపులు రావడంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు బయలుదేరే సమయానికి ఆకాసా QP 1335 విమానంలో 177 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో ముగ్గురు చిన్నారులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారని అకాసా ఎయిర్ ప్రతినిధి వెల్లడించారు. బెదిరింపు కారణంగా విమానం ఢిల్లీకి తిరిగి వచ్చినట్లు తెలిపారు. అలాగే, ఇండిగోకి చెందిన 6E 651 ముంబై-ఢిల్లీ విమానం బెదిరింపు కాల్ కారణంగా అహ్మదాబాద్‌కు దారి మళ్లించి, ప్రయాణికులను సురక్షితంగా తరలించినట్లు ఇండిగో ప్రతినిధి చెప్పుకొచ్చారు.

వరుస బెదిరింపులు..
ఇదే తరహాలో మంగళవారం కూడా ఎయిర్ ఇండియా ఢిల్లీ-చికాగో విమానం, డమ్మమ్-లక్నో ఇండిగో విమానం, అయోధ్య-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దర్భంగా నుండి ముంబైకి స్పైస్‌జెట్ విమానం (SG116), బాగ్‌డోగ్రా నుండి బెంగళూరుకు అకాస ఎయిర్ విమానం (QP 1373) అలయన్స్ ఎయిర్ అమృత్‌సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానానికి (9ఐ 650), మదురై నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి (ఐఎక్స్ 684)కి బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
ప్రత్యేక సమావేశం..
అలాగే, సోమవారం కూడా రెండు ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా విమానాకి ఇలాగే నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. విమాన ఆపరేషన్స్‌కి ఇబ్బందులు తలెత్తేలా వరుసగా బెదిరింపు వస్తుండడంతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ రోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ముందు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్‌నాయుడు ఆ మంత్రిత్వ శాఖ, డీసీజీఏ అధికారులతో చర్చించారు. ఈ బెదిరింపులకు పాల్పడుతోన్న కొందరు అనుమానితులను అధికారులు గుర్తించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications