400 మీటర్ల లోయలో పడిన బస్సు.. 12 మంది దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం పెనువిషాదం చోటుచేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి సుమారు 400 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మరణించగా.. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సిర్మౌర్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన హరిపుర్‌ధార్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోలన్ నుంచి కుప్వీకి వెళ్తున్న ఈ బస్సు రాజ్‌గఢ్ సమీపంలోని నిటారుగా ఉన్న మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. కొండ ప్రాంతాల్లో రోడ్లు ఇరుకుగా ఉండటం, రక్షణ గోడలు లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణాలని భావిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్థులు స్పందించి లోయలోకి దిగి క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులు, జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి తాళ్లు, స్ట్రెచర్ల సహాయంతో మృతదేహాలను, గాయపడిన వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే హరిపుర్‌ధార్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఘటనపై స్పందిస్తూ, సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. తీవ్రంగా దెబ్బతిన్న బస్సు భాగాల మధ్య మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications