సీబీఐ ఉచ్చులో కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరింత కూరుకుపోయారు. ఈ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆయన ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఉన్నారు. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు.
అదే సమయంలో సీబీఐ అధికారులు కూడా ఆయనను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి కిందటే వెల్లడించారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు న్యాయస్థానానికి తెలియజేశారు. కేజ్రీవాల్‌ను కోర్ట్ రూమ్‌లోనే విచారించడానికి అనుమతి సైతం లభించింది.

ఆయనన అరెస్ట్ చేయడానికి తగిన సాక్ష్యాధారాలు గానీ, డాక్యుమెంట్లు గానీ కోర్టు రూమ్‌లోనే అరెస్ట్ చేయవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. కేజ్రీవాల్‌ను అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) 1988 కింద అరెస్ట్ చేయడానికి ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీ నాడే అనుమతి లభించినట్లు సీబీఐ తరఫున వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీపీ సింగ్ వివరించారు.
ఇదే కేసులో భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమె కూడా ఈడీ, సీబీఐ అధికారుల అదుపులో ఉన్నారు. తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. కవిత కస్టడీ జూలై 3వ తేదీ వరకు ఉండబోతోంది.
ఇన్ని రోజుల పాటు నిర్వహించిన విచారణ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ గానీ, కవిత గానీ తమకు సహకరించట్లేదంటూ అటు ఈడీ అధికారులు కూడా గతంలో పలుమార్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తాము అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలను ఇచ్చారనేది వారి వాదన. జ్యుడీషియల్ కస్టడీ ప్రతీసారీ పెంచుకుంటూ వెళ్లడానికి ఇదే ప్రధాన కారణమైంది.












Click it and Unblock the Notifications