మళ్లీ రెచ్చిన పాక్, ఈసారి పూంచ్‌లో కాల్పులు: పాక్ జాతీయ భద్రతా సలహాదారు ఫోన్
న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రయిక్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ రెచ్చిపోతోంది. బారాముల్లా, ఆ తర్వాత గురుదాస్‌పూర్‌లో కాల్పుల విరమణను ఉల్లంఘించింది. అంతలోనే పూంచ్ సెక్టారులో కూడా పాకిస్తాన్ రెచ్చిపోయింది. పూంచ్ వద్ద కాల్పులు జరిపింది.
ఐక్య రాజ్య సమితిలో ఏకాకి కావడం, తమను టార్గెట్‌గా చేస్తూ సార్క్ సమావేశాలు వాయిదా పడటం, చాలా దేశాలు ఉగ్రవాదం విషయంలో పాక్ వైపు వెలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో పాక్.. భారత్ పైన రెచ్చిపోతోంది. కొద్ది గంటల వ్యవధుల్లోనే బారాముల్లా, గురుదాస్‌పూర్ అనంతరం.. తాజాగా పూంచ్ సెక్టారులో కాల్పులు జరిపింది.

పారికర్‌తో మాట్లాడిన పాక్ జాతీయ భద్రతా సలహాదారు
పాకిస్తాన్ వరుసగా కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. దీనిపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా సమీక్షిస్తున్నారు. త్రివిధ దళాధిపతులతో పారికర్ సమీక్షించారు.
భారత్, పాక్ భద్రతా సలహాదారులు సరిహద్దులోని పరిస్థితి గురించి మాట్లాడుకున్నారని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తెలిపినట్లుగా పత్రికలో వార్తలు వచ్చాయి.
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పాక్ జాతీయ భద్రతా సలహాదారు నజీర్ ఖాన్ జాంజ్వా ఫోన్‌లో మాట్లాడుకున్నారని, నియంత్రణ రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అరికట్టేందుకు తీసుకోవల్సిన చర్యలపై చర్చించారని అజీజ్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications