చైనా నుంచి కాంగ్రెస్ ‘ఆర్‌జీఎఫ్’కు డబ్బులు, అందుకే ఆ పార్టీ ఇలా: అమిత్ షా సంచలనం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని మండిపడ్డారు. చైనా సరిహద్దు వివాదంపైనా ఆయన మాట్లాడారు. 1962లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్నారు.

చైనా నుంచి కాంగ్రెస్ పార్టీకి డబ్బులంటూ అమిత్ షా సంచలనం
అంతేగాక, చైనా రాయబార కార్యాలయం నుంచి కాంగ్రెస్ నేతల సంస్థకు డబ్బులు చేరాయని అమిత్ షా ఆరోపించారు. రాజీవ్ ఫౌండేషన్ కోసం ఆ డబ్బులు అందాయని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఏ ఒక్కరూ భారతదేశంలో అంగుళం భూమిని కూడా ఆక్రమించలేరని అమిత్ షా తేల్చి చెప్పారు.

రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు ఎఫ్‌సీఆర్ఏ రద్దు అందుకేనన్న షా
సరిహద్దులో భారత్-చైనా బలగాల ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేస్తారని చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నోత్తరాల సమాయాన్ని అడ్డుకుందని అమిత్ షా మండిపడ్డారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు సంబంధించి ఎఫ్‌సీఆర్ఏ రద్దు గురించి వేసిన ప్రశ్న ప్రస్తావనకు రాకుండా ఉండేందుకే సరిహద్దు అంశాన్ని పార్లమెంటులో కాంగ్రెస్ లేవనెత్తిందని ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించిన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

చైనా ఎంబసీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు రూ. 1.35 కోట్ల గ్రాంట్
2005-06, 2006-07 మధ్య కాలంలో చైనా రాయబార కార్యాలయం నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రూ. 1.35 కోట్ల గ్రాంట్ పొందిందని అమిత్ షా తెలిపారు. అందువల్లే దాని రిజిస్ట్రేషన్ కేంద్ర హోంశాఖ రద్దు చేసిందన్నారు. చైనా మీద నెహ్రూకు ఉన్న ప్రేమ కారణంగానే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని అమిత్ షా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలోనే భారత్ తన భూభాగాన్ని చైనాకు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనాతో జరిగిన తాజా ప్రతిష్టంభనపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేశారు. ఎల్ఏసీ వద్ద జరిగిన ప్రతిష్టంభనలో భారత సైనికులెవరూ తీవ్రంగా గాయపడలేదని లేదా వీరమరణం పొందలేదని రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతున్న ప్రతిపక్షాలు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలోని ఎల్ఏసీని ఆక్రమించడం ద్వారా పీఎల్ఏ వర్గం ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిందని తెలిపారు. అయితే, చైనా చేసిన ఈ ప్రయత్నాన్ని మన సైన్యం దృఢ సంకల్పంతో ఎదుర్కొంది. ఈ క్రమంలో తోపులాట జరిగిందన్నారు రాజ్‌నాథ్ సింగ్. మన సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.












Click it and Unblock the Notifications