తెలంగాణకూ లాభం: చిరు, విహెచ్‌కు అడ్డు తగిలారా?
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సోమవారం అన్నారు. రాజ్యసభలో పోలవరం అంశానికి సంబంధించి ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు బిల్లును తెచ్చినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లాభం అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు. నదులు అనుసంధానం అవుతున్న తొలి ప్రాజెక్టు పోలవరం అన్నారు.

పోలవరంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. భద్రాచలం గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో రెవెన్యూ డివిజన్ అన్నారు. పోలవరం వల్ల 25.5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. పోలవరం పూర్తవ్వాలనే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం ముంపు గ్రామాలను ఏపీలో కలుపుతూ నిర్ణయం తీసుకుందన్నారు.
పోలవరం గొప్ప ప్రాజెక్టు అని, దానిని అడ్డుకోవద్దన్నారు. ప్రస్తుత బిల్లులో పునరావాస చర్యలు ఉన్నాయన్నారు. ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాలోకి మళ్లించవచ్చునని చెప్పారు. 2.5 టీఎంసీల నీటిని ఛత్తీస్‌గఢ్ అదనంగా వాడుకోవచ్చునన్నారు. ప్రస్తుత డిజైన్‌లోనే పోలవరం వల్ల అనేక లాభాలున్నాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదన్నారు. భద్రాచలం పట్టణాన్ని కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలన్నారు.
1956కు ముందు ఏపీలోనే: కేవీపీ
1956కు ముందు భద్రాచలం డివిజన్ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమన్నారు. పోలవరంపై మాట్లాడేందుకు కేవీపీ మరింత సమయం కోరారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎంపీలు ఆందోళన వ్యక్తం చేయడంతో గందరగోళం ఏర్పడింది.
సంబరాలు చేసుకున్నారు: జేడీ శీలం
ముంపు ప్రాంతాలను ఏపీలోనే కలపాలని యూపీఏ నిర్ణయించిందని జేడీ శీలం అన్నారు. ముంపు ప్రాంతాలను ఏపిలో కలిపే సవరణను తాను సమ్మతిస్తున్నానని చెప్పారు. ముంపు ప్రాంతాలను ఏపీలో కలపాలనే నిర్ణయాన్ని అందరూ నాడు స్వాగతించారన్నారు. ముంపు ప్రాంతాలను కలుపుతారని తెలిసినా తెలంగాణలో సంబరాలు చేసుకున్నారన్నారు.
విహెచ్ మాట్లాడుతుంటే...!
కాగా అంతకుముందు, రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెసు ఎంపీ వి హనుమంత రావు... చైర్మన్ ఇచ్చిన సమయం పూర్తయినప్పటికీ అలాగే మాట్లాడుతూ వెళ్లారు. దీంతో విహెచ్ మీకేమయిందంటూ చైర్మన్ పలుమార్లు అన్నారు. విహెచ్ అనంతరం చిరంజీవిని మాట్లాడాల్సిందిగా సూచించారు. అయితే విహెచ్ మాత్రం తన ప్రసంగాన్ని ఆపలేదు. దీంతో.. మీకేమయిందంటూ విహెచ్‌ను అంటూ.. చిరంజీవిని మాట్లాడాల్సిందిగా సూచించారు.
మరోవైపు, విహెచ్ మాట్లాడుతుంటే.. చిరంజీవి అడ్డు తగలబోయారని ఓ టీవీ ఛానల్లో స్కోరింగ్ వస్తోంది. రాజ్యసభలో కాంగ్రెసు పార్టీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రదర్శించిందని పేర్కొంది. విహెచ్ మాట్లాడుతుంటే చిరంజీవిని లేచి మాట్లాడాల్సిందిగా జైరామ్ రమేష్, కేవీపీ రామచంద్ర రావులు సూచించారని పేర్కొంది.












Click it and Unblock the Notifications