CJP Protest Day 13: మరింత క్షీణించిన సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం
దేశ రాజధాని దిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 20న ప్రారంభమైన ఆందోళనలు 13 రోజులుగా నిరాటంకంగా సాగుతున్నాయి. నీట్- యూజీ 2026 పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీక్ లకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేస్తూనే ఉన్నారు. ఇక ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ఇదే ప్రాంగణంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి ఇప్పటికి ఐదు రోజులు అవుతుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది.
ఆమరణ దీక్షలో భాగంగా ఆయన రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్) ఒక్కసారిగా 60కి పడిపోవడంతో అక్కడ ఉన్న శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో ఈ నిరసనలు సాగుతున్నాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక దేశవ్యాప్తంగా దాదాపు 12 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో దిల్లీ వేదికగా ప్రారంభమైన ఈ ఆందోళనలు ప్రస్తుతం 13వ రోజుకు చేరుకున్నాయి.
మద్దతుగా వినూత్న నిరసనలు, చర్చలు
ఈ ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు నిరసనకారులు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే 'కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే 'చాయ్ పే చర్చ విత్ కాక్రోచెస్' అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆందోళనకారులు, సాధారణ ప్రజలు కలిసి టీ తాగుతూ విద్యావ్యవస్థలో అత్యవసరంగా తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రయత్నానికి విశేష స్పందన లభిస్తోంది.
ప్రస్తుతం ఈ నిరసనల ఉధృతి కేవలం దిల్లీకే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, లక్నో వంటి ప్రధాన నగరాల్లో కూడా విద్యార్థులు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నాయి. నీట్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని, విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేలా విద్యా విధానంలో తగిన మార్పులు చేయాలని సంఘాలు పట్టుబడుతున్నాయి.

ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేవరకు తమ ఆందోళనలను ఆపే ప్రసక్తే లేదని నిరసన కారులు తేల్చిచెప్పారు. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో ఆందోళనకారుల కోసం తక్షణమే నిరసన స్థలాల వద్ద మొబైల్ వైద్య శిబిరాలు, అత్యవసర సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతినిధులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications