నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ క్లోజ్..! ఈ టూరిస్ట్ స్పాట్లకు వెళ్లొద్దు..!
నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) ను అధికారులు మూసేశారు. మూడు నెలల పాటు ఇక్కడ పర్యాటకంపై అటవీ శాఖ నిషేధం విధించింది. వన్యప్రాణులకు, ముఖ్యంగా పులుల సంతానోత్పత్తికి ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు సెప్టెంబర్ 30 వరకు ఈ కఠిన నిబంధనలు అమలులో ఉంటాయి. ఈ మూడు రోజుల పాటు టైగర్ రిజర్వ్ (Nagarjunasagar-Srisailam Tiger Reserve)లో సఫారీ వాహనాల శబ్దాలు వినపడవు, పర్యాటకుల సంచారం కూడా పూర్తిగా నిలిచిపోతుంది.
ఈ ఆంక్షల వల్ల ఇష్టకామేశ్వరి ఆలయం, గుండ్ల బ్రహ్మేశ్వరం, బైర్లూటి జంగిల్ క్యాంప్, తుమ్మలబైలు, దోర్నాల-శ్రీశైలం సఫారీ వంటి పర్యాటక ప్రాంతాలు మూతపడనున్నాయి. అయితే శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తుల రాకపోకలకు మాత్రం నిబంధనల మేరకు అనుమతి ఉంటుంది. నంద్యాల, ఆత్మకూరు, మార్కాపురం, గిద్దలూరు అటవీ డివిజన్ల వ్యాప్తంగా ఈ నిషేధ ఉత్తర్వులు వర్తిస్తాయి. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయిన NSTR దాదాపు 3,728 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ పులుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతోంది. జాతీయ పులుల పరిరక్షణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.

2018లో ఈ అడవిలో కేవలం 47 పులులు ఉండగా, 2024 నాటికి వాటి సంఖ్య 76కు, అలాగే 11 పిల్లలకు పెరిగాయి. మరోవైపు మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం తరహాలోనే, తమకు కూడా ఈ మూడు నెలల పాటు జీవన భృతి కల్పించాలని చెంచు తెగ ప్రజలు కోరుతున్నారు. పులిని తాము జంతువుగా కాకుండా దైవసమానంగా పూజిస్తామని, అయితే తమ కుటుంబాల ఆకలి తీర్చే మార్గాలను కూడా ప్రభుత్వం పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నల్లమల అడవులను నమ్ముకున్న చెంచులు దాదాపు 47,315 మంది ఆంధ్రప్రదేశ్‌లో, మరో 15వేల మంది తెలంగాణలో నివసిస్తున్నారు.














Click it and Unblock the Notifications