కుంభరాశి, మీన రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు అద్భుతమైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల కొన్ని రాశులకు అదృష్టం, మరికొన్ని రాశులకు దురదృష్టం వరిస్తుంది. అయితే చాలావరకు అన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కచ్చితంగా దక్కుతాయి. సెప్టెంబరు నెలకు సంబంధించి కుంభరాశి, మీన రాశివారి జాతక ఫలం ఎలా ఉందో తెలుసుకుందాం.
కుంభ రాశి (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
కుంభ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నప్పటికీ, ఈ నెలలో కొన్ని ముఖ్యమైన పనులు అనుకూలంగా సాగుతాయి. శ్రమ ఎక్కువైనప్పటికీ ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. పని ఒత్తిడి, శ్రమ ఎక్కువ ఉంటుంది. సహోద్యోగులతో అనవసర వాదనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. జాగ్రత్తగా వ్యవహరిస్తే వృత్తిపరంగా మంచి ఫలితాలు పొందుతారు. రాబడి బాగానే ఉన్నప్పటికీ, అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

కొత్తగా ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా హామీలు ఉండటం మంచిది కాదు. ఇంటా బయటా అందరినీ గౌరవిస్తూ ముందుకు సాగాలి. చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉన్నందున మాట పట్టింపులకు పోకపోవడం మంచిది. చదువుపై ఏకాగ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది, కష్టపడి చదివితేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. శని దేవునికి తైలాభిషేకం చేయించడం లేదా శనివారాల్లో ఆంజనేయస్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శ్రమ తగ్గి శుభఫలితాలు కలుగుతాయి.
మీన రాశి (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు)
మీన రాశి వారికి జన్మ శని ప్రభావం ఉన్నప్పటికీ, గురు గ్రహం, ఇతర అనుకూల గ్రహాల సంచారం వల్ల ఈ నెలలో శుభ యోగాలు, పురోగతి కనిపిస్తున్నాయి. ఆఫీసులో మీరు చేసే పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిలిచిపోయిన రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. పాత పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు లభించే అవకాశం ఉంది.
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది, శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారవేత్తలకు నూతన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రాబడి బాగుంటుంది. జన్మ శని దోష నివారణకు ప్రదోష కాలంలో శివారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.














Click it and Unblock the Notifications