గడ్డకట్టించే చలి- కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలిలా..
IMD: మొన్నటి వరకు దక్షిణాది రాష్ట్రాలను వరుస అల్పపీడనాలు, తుఫాన్లు ముంచెత్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి సహా ఏపీ, కర్ణాటకల్లోనూ అతి భారీ వర్షాలు కురిశాయి. వర్షాల బారి నుంచి తమిళనాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
దక్షిణాది పరిస్థితి ఇలా ఉంటే ఉత్తరాది రాష్ట్రాలను చలి వెంటాడుతోంది. గజగజమంటూ వణికిస్తోంది. డిసెంబర్ తొలి వారం నుంచే చలిగాలులు దాదాపుగా అన్ని రాష్ట్రాలను చుట్టుముట్టాయి. దట్టమైన పొగమంచు అలముకుంటోంది. దేశ రాజధాని సహా నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గడ్డకట్టించే వాతావరణం నెలకొంటోంది.

హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తోన్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మున్ముందు రాత్రి ఉష్ణోగ్రత మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది.
గత 24 గంటల వ్యవధిలో కనిష్ఠ ఉష్ణోగ్రత పంజాబ్‌లో నమోదైంది. అమృత్‌సర్- 5.1 డిగ్రీల సెల్సియస్ మేర కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. దీని తరువాత హర్యానా హిసార్‌లో అత్యల్పంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హిమాలయ పర్వత శ్రేణుల మీదుగా వీస్తోన్న చలిగాలులు, అక్కడ కురుస్తోన్న మంచు వర్షం వల్ల చలిగాలుల తీవ్రత ఇక్కడ ఒక్కసారిగా పెరిగింది.
రాజస్థాన్‌లోని చురు- 7.2, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్- 7.9, చండీగఢ్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 8.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలోని సఫ్దర్‌గంజ్‌లో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఢిల్లీకి సంబంధించిన ఈ సీజన్‌లో ఈ స్థాయిలో టెంపరేచర్ పడిపోవడం ఇదే తొలిసారి.
పొగమంచు దట్టంగా అలముకోవడం వల్ల ఎదురుగా ఏముందు తెలియని పరిస్థితి నెలకొంది. చలి తీవ్రత ప్రభావం రోజువారీ కార్యకలాపాలపై తీవ్రంగా పడింది. జనం బయటికి రావడానికి జంకుతున్నారు. వయోధిక వృద్ధులు శ్వాస సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొన వచ్చని డాక్టర్లు చెబుతున్నారు. జాగింగ్‌కు చేసే వాళ్లు అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని ఐఎండీ సూచించింది.












Click it and Unblock the Notifications