Poll Resuts: కాంగ్రెస్ అవస్ధ-మహారాష్ట్రలో చిత్తుగా ఓడి..జార్ఖండ్ లో ఉనికి కాపాడుకుని..
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయింది. అలాగే జార్ఖండ్ లోనూ అధికార ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమైంది. దీంతో ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాలపై అంత వ్యతిరేకంగా లేరని అర్దమవుతోంది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో మహారాష్ట్రలో అధికారంలో లేని కాంగ్రెస్ మరోసారి చెత్త ప్రదర్శన చేసింది. జార్ఖండ్ లో మాత్రం ఉనికి కాపాడుకుంటోంది.
గత లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుంది. ముఖ్యంగా కీలకమైన మహారాష్ట్రలో బీజేపీని కాదని ఓటర్లు కాంగ్రెస్ ను ఆదరించారు. అందులోనూ విదర్భ వంటి కీలకమైన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ సీట్లు గెల్చుకుని బీజేపీని వెనక్కి నెట్టింది. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఊపు కొనసాగించాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ ఓటర్లు మాత్రం మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉన్న కాంగ్రెస్ ను తిరస్కరించారు.

మహారాష్ట్రలో ఫలితాల తాజా సరళి గమనిస్తే ఏకంగా 101 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్ధానాలకు పరిమితమయ్యేలా కనిపిస్తోంది. దీంతో లోక్ సభ ఎన్నికల ఊపును కొనసాగించడంలో విఫలం కావడమే కాదు మహారాష్ట్ర ఓటరు నాడిని పసిగట్టడంలో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు జార్ఖండ్ లో మాత్రం కాంగ్రెస్ పరువు దక్కించుకునేలా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 16 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ ఈసారి మాత్రం 15 సీట్లకే పరిమితం అయ్యేలా ఉంది. దీంతో జార్ఖండ్ లో కాంగ్రెస్ ఉనికి కాపాడుకుంటోంది. అయితే ఇక్కడ ఇండియా కూటమి అధికారంలోకి రానుండటం కాంగ్రెస్ కు ప్లస్ అవుతోంది.












Click it and Unblock the Notifications