ఫలితాలపై కాంగ్రెస్ విస్మయం-ఓట్ల చీలిక వల్లేనన్న చిదంబరం-బీజేపీకి ఓటా అని హరీష్ రావత్ ప్రశ్న
ఇవాళ ప్రకటించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో పార్టీ ప్రదర్శన పేలవంగా ఉండటం, బీజేపీకి ప్రజలు ఏకపక్ష విజయాలు కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షించిన మాజీ కేంద్ర హోంమంత్రి చిదంబరం.. ఈసారి ఎన్నికల్లో అక్కడ వెలువడిన ఫలితాలపై స్పందించారు. గోవాలో పోటీ పడిన అన్ని పార్టీల మధ్య ఓట్ల చీలిక తమ కొంప ముంచిందని ఆయన విశ్లేషించారు. ఓట్ల చీలిక వల్ల తాము ఆశించిన స్దాయిలో ఓట్లు రాలేదని చిదంబరం తెలిపారు. బీజేపీ 33 శాతం ఓట్లు మాత్రమే సాధించగా.. మిగతా ఓట్లన్నీ విపక్షాల మధ్య చీలిపోయాయన్నారు. అయినా గోవా ప్రజల తీర్పును తాము అంగీకరిస్తున్నట్లు చిదంబరం వెల్లడించారు. తమ అభ్యర్ధులు ఎన్నో అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా పోరాడారని ఆయన ప్రశంసించారు. ప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని ఓట్లేశారని, దాన్ని తాము ఆమోదిస్తున్నామన్నారు. చాలా నియోజకవర్గాల్లో తమ అభ్యర్ధులు స్వల్ప తేడాతో ఓడిపోయారని చిదంబరం తెలిపారు.

మరోవైపు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై సీఎం అభ్యర్ధి హరీష్ రావత్ స్పందించారు. సీఎం అభ్యర్ధిగా ఉంటూ స్వయంగా ఓటమిపాలైన హరీష్ రావత్.. ఈ ఫలితాలపై విస్మయం వ్యక్తం చేశారు. ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు. ఇంత భారీ ద్రవ్యోల్బణం తర్వాత ప్రజల తీర్పు ఇదేనా అని రావత్ ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి అర్ధమేంటని రావత్ కూడా ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ప్రజలు బీజేపీ జిందాబాద్ అని ఎలా అనగలుతున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు.













Click it and Unblock the Notifications