రాహుల్ గాంధీ ఫాలోస్ వైెస్ జగన్..!!
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించింది- ఎన్నికల మేనిఫెస్టో. ఇందులో పొందుపరిచిన అయిదు ఉచిత హామీలు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయి. హామీలను ఇవ్వడం వరకే పరిమితం కాలేదు కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వాటి అమలుకు శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని కల్పిస్తోంది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే దీన్ని అమలు చేసింది. గృహ జ్యోతి స్కీమ్ కూడా అమల్లోకి వచ్చింది. జూలై 1వ తేదీన గృహావసర వినియోగదారులకు 200 యూనట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతిని ప్రారంభించింది సిద్ధరామయ్య సర్కార్.

ఇక తాజాగా- గృహ లక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ప్రతి నెలా 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ఉద్దేశించిన పథకం ఇది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దీన్ని లాంఛనంగా ఆరంభించింది. అక్కచెల్లెమ్మలకు ఆర్థిక ఆసరాను అందిస్తోన్నామని ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ పథకం ఆరంభమైంది. దీనికోసం మైసూరులో బహిరంగ సభను ఏర్పాటు చేసింది సిద్ధరామయ్య ప్రభుత్వం. ఈ సభా వేదిక మీద- బటన్ నొక్కి ఈ నిధులను లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు రాహుల్ గాంధీ. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అచ్చంగా ఫాలో అయ్యారు రాహుల్ గాంధీ.
అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రజలకు అయిదు వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అందులో మూడింటిని కార్యరూపంలోకి తీసుకొచ్చిందని అన్నారు. బటన్ నొక్కి నేరుగా 2,000 రూపాయల ఆర్థిక సహాయం మహిళల ఖాతాల్లోకి జమ చేశామని చెప్పారు.

మహిళా సాధికారత కోసం తాము కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ అన్నారు. అయిదు హామీల్లో ఒకటి తప్ప అన్నీ మహిళల కోసం ఉద్దేశించినవేనని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కోటీశ్వరుల కోసం పని చేస్తోండగా.. కర్ణాటకలోని తమ ప్రభుత్వం మాత్రం పేదలు, బలహీనుల వర్గాలు, మహిళల శ్రేయస్సు, వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications