అసాని అలర్ట్: ఆంధ్రా, బెంగాల్, ఒడిశాలో ప్రభావం.. గంటకు 90 కి.మీ వేగంతో గాలులు
అసాని తుఫాను అలజడి రేపుతోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతోంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. పోర్ట్ బ్లెయిర్‌కి 400 కి.మీ., విశాఖపట్టణానికి 940 కి.మీ, పూరీకి ఆగ్నేయంగా 1000 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయ్యింది. వచ్చే 12 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్రంగా మారనుంది.
తుపాన్ మంగళవారం సాయంత్రానికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద కేంద్రీకృతం అవనుంది. ఒడిషా తీరానికి అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం వైపు వెళ్ళే అవకాశం ఉంది. దీంతో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు వేగముతో గాలులు వీయడంతో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారులు స్పష్టంచేశారు.

ఆంధ్రప్రదేశ్ తీరంలో గల విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు అసాని తుఫాను ప్రభావం ఉండనుంది. దీంతో విపత్తుల నిర్వహణశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంది. కుండపోత వర్షం కురిసేందుకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ వివరించింది.
తుఫాను తీరం దాటే సమయంలో గాలుల వేగం ఒడిశాలో 90 కిలోమీట్ల వేగం ఉంటుందని భారత వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. మే 8వ తేదీ నుంచి బెంగాల్, ఒడిశాలో గల నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను నేపథ్యంలో అండమాన్ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుఫాను ప్రభావం ఒడిశాపై ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అక్కడ ఎన్డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.












Click it and Unblock the Notifications