"జయ మృతి.. అంతరంగిక విషయాలను బయటపెట్టి తీరుతా"
అత్త జయలలిత మృతికి సంబంధించి అంతరగింక విషయాలు ఉన్నాయని దీప పేర్కొనడం.. అనుమానాలను లేవనెత్తేదిగా ఉంది.
చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలితకు ఆమె నెచ్చెలి శశికళ అంత్యక్రియలు నిర్వహించడం పట్ల జయలలిత మేనకోడలు దీప అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ మహిళ అంత్యక్రియలు నిర్వహించడం తనను వేదనకు గురిచేసిందని తెలిపారు. అత్త జయలలిత మృతికి సంబంధించి అంతరగింక విషయాలు ఉన్నాయని దీప పేర్కొనడం.. అనుమానాలను లేవనెత్తేదిగా ఉంది.
త్వరలోనే ఆ అంతరంగిక విషయాలను బయటపెడుతానని దీప చెప్పారు. కాగా, జయలలిత సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మి దంపతుల కుమార్తెనె దీప. కొంతకాలం జయలలిత అధికారిక నివాసం పోయెస్ గార్డెన్ లోనే వీరు కూడా ఉండేవారు. అయితే మధ్యలో తలెత్తిన కొన్ని విభేదాల కారణంగా చెన్నైలోని టీనగర్ కు మకాం మార్చారు.

కుటుంబం పోయెస్ గార్డెన్ లో ఉన్నప్పుడే దీప జన్మించింది. పోయెస్ గార్డెన్స్ కు సంబంధించి పలు సంచలన వ్యాఖ్యలతో గతంలోను దీప వార్తల్లోకి ఎక్కారు. జయలలితను కలవడానికి వెళ్లిన ఓ సందర్బంలో.. గేటు వద్దే సెక్యూరిటీ ఆమెను అడ్డుకోవడంతో.. ఆ ఇంటిని తన నాయనమ్మ (జయలలిత తల్లి సంధ్య) తనకు రాసిచ్చారని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయని దీప వాదించారు.
తన ఇంట్లోకి తాను వెళ్లేందుకు అనుమతులు తీసుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జయలలితను చూడటం కోసం దాదాపు వారం పాటు ఇంటిముందే నిరీక్షించినా లాభం లేకుండా పోయింది. తాజాగా అంత్యక్రియలపై ఆమె చేసిన వ్యాఖ్యలు కొంత వివాదస్పదంగా ఉండటంతో మున్ముందు పరిణామాలపై ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications