మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన మెట్రో రైల్, కానీ, షరతులు
న్యూఢిల్లీ: మద్యం ప్రియులకు ఢిల్లీ మెట్రో రైలు యాజమాన్యం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ఢిల్లీ మెట్రోలో సీల్ వేసిన మెట్రో బాటిళ్లు తీసుకుని వెళ్లవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. ఇందుకు నిబంధనలను సడలించింది. అయితే, మెట్రో రైలులో గానీ, మెట్రో స్టేషన్లలో గానీ మద్యం సేవించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ మినహా ఢిల్లీ మెట్రోలో ఇటీవల వరకు మద్యం రవాణా చేయడం నిషేధించారు. "CISF, DMRC అధికారులతో కూడిన ఒక కమిటీ జాబితాను సమీక్షించింది. సవరించిన జాబితా ప్రకారం.. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లోని నిబంధనలతో సమానంగా ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తి రెండు సీలు వేసిన మద్యం బాటిళ్లను తీసుకువెళ్లడానికి అనుమతించబడుతుంది' అని చెప్పారు.

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా ప్రయాణికులు ప్రయాణించేటప్పుడు సరైన ఆకృతి(సరైన విధంగా దుస్తులు ధరించడం)ని పాటించాలని స్పష్టం చేసింది. మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రయాణికులపై సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఢిల్లీ మెట్రోలో నిషేధించబడిన వస్తువుల జాబితాలో.. పదునైన వస్తువులు, మండే వస్తువులు, పేలుడు పదార్థాలు, డిసేబుల్ కెమికల్స్, తుపాకులు, ఇతర ప్రమాదకర వస్తువులు ఉన్నాయి.
ఇది ఇలావుండగా, శుక్రవారం ఉదయం ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ మెట్రోలో ప్రయాణించిన విషయం తెలిసిందే. ఆయన లోక్ కళ్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కి, ఎల్లో లైన్‌లోని విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్‌లో దిగారు.
మెట్రో రైలులో ప్రయాణించిన మోడీ.. ప్రయాణికులతో కూర్చొని వారితో సంభాషిస్తున్న చిత్రాలను పంచుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుక ముగిసిన తర్వాత, ప్రధాని తిరిగి మెట్రోలో ప్రయాణించారు.












Click it and Unblock the Notifications