ఢిల్లీని వణికిస్తున్న యమునా నది: ప్రమాదకర స్థాయిని దాటి ప్రవాహం, హై-అలర్ట్
న్యూఢిల్లీ: గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమవుతోంది. యమునా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో ప్రమాదకర స్థాయిలో ప్రవాహం ఆందోళనకు గురిచేస్తోంది. హత్నీ కుండ్ బ్యారేజీ నుంచి హర్యానా దాదాపు 2,13,679 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద 204.50 మీటర్ల ప్రమాదకర మార్కును అధిగమించింది.
పెరిగిన నీటి మట్టం దేశ రాజధానిని వరద అంచున నెట్టివేసింది. రాత్రి 8 గంటలకు, పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం 205.76 మీటర్లుగా నమోదైంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సహాయక చర్యల కోసం ఆదేశాలు జారీ చేసింది.

సోమవారం మీడియా సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. యమునా నది 206 మీటర్ల మార్కును దాటిన తర్వాత యమునా చుట్టూ ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడం ప్రారంభిస్తామని చెప్పారు. ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని, యమునా 206 మీటర్ల నీటిమట్టం దాటిన వెంటనే, నది ఒడ్డున ఉన్న జనాల తరలింపు ప్రారంభిస్తామని చెప్పారు.
#WATCH | Water level in Yamuna river reaches near danger mark at Old Railway Bridge. pic.twitter.com/oNfL7qwe1c
— ANI (@ANI) July 10, 2023
తరలింపు ప్రక్రియకు సంబంధించి అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. యమునా నది ఒడ్డున నివసించే వారిని మాత్రమే తరలిస్తామని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. ఢిల్లీలో వరదలు వచ్చే అవకాశం లేదని, అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇంత భారీ వర్షాన్ని పరిష్కరించడానికి ఢిల్లీ డ్రైనేజీ వ్యవస్థలను రూపొందించలేదని గత ప్రభుత్వాలపై మండిపడ్డారు.
"వాతావరణ అంచనాల ప్రకారం, యమునాలో నీటి మట్టం చాలా ఎక్కువగా పెరుగుతుందని అంచనా వేయబడలేదు, వరదలు వచ్చే అవకాశం లేదు. యమునా 206 మీటర్ల మార్కును దాటితే, మేము నది ఒడ్డున ఉండే ప్రజల తరలింపు ప్రారంభిస్తాము' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
"జులై 8, 9 తేదీల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇంత అదిక వర్షం వస్తే తట్టుకునేలా ఢిల్లీ వ్యవస్థలు రూపొందించబడలేదు, అందువల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు" అని సీఎం కేజ్రీవాల్ అన్నారు.
వరద ముంపు ప్రాంతాలను, యమునా నది నీటి మట్టాన్ని పర్యవేక్షించడానికి, కేజ్రీవాల్ ప్రభుత్వం సెంట్రల్ కంట్రోల్ రూమ్‌తో సహా 16 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఆదివారం ఉదయం 8:30 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 1982 నుంచి జూలైలో ఢిల్లీలో అత్యధిక వర్షపాతం (153 మిమీ) నమోదైంది. రాబోయే 24 గంటల్లో, దేశ రాజధానిలో 107 మిల్లీమీటర్ల అదనపు వర్షపాతం నమోదైంది, ఇది అనేక ప్రాంతాలను జలమయం చేసింది.












Click it and Unblock the Notifications