అసెంబ్లీ ఫలితాలు : అమ్మ కంటే అక్కనే భేష్..
ఎగ్జిట్ పోల్స్ సర్వేలు.. ఎవరు గెలుస్తారన్న చర్చలు.. అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మొత్తానికి ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పటికే గెలుపును ఖరారు చేసుకున్న ఆయా పార్టీల ఫలితాలపై విశ్లేషణలు కూడా మొదలైపోయాయి. ఇదే క్రమంలో మహిళా అధినేత్రులు మమతా బెనర్జీ, జయలలిత గెలుపును పాత లెక్కలతో సహా లెక్కగట్టి మరీ ఎవరి ప్రభ పెరిగింది.. ఎవరి ఫాలోయింగ్ తగ్గింది అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అయితే.. తమిళ ప్రజల ఆరాధ్య నేత 'అమ్మ' జయలలిత కంటే, బెంగాల్ ప్రజలు దీదీగా (అక్క) పిలుచుకునే మమతా బెనర్జీనే స్థిరమైన ఫాలోయింగ్ తో కొనసాగుతున్నారు. ఇందుకు నిదర్శనం గత ఎన్నికలకు ఇప్పటికీ మమతా బెనర్జీ ఓటు బ్యాంకులో ఏమాత్రం తేడా రాకపోగా.. గత ఎన్నికలతో పోల్చి చూస్తే జయలలిత ఓటు బ్యాంకుకు మాత్రం భారీగానే గండిపడింది.

2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 203 సీట్లను కైవసం చేసుకోవడంతో సీఎం పీఠమెక్కారు జయలలిత. ప్రస్తుత ఎన్నకల ఫలితాలను పరిశీలిస్తే.. అన్నాడీఎంకే కి 130 సీట్లు మాత్రమే సాధించింది, అంటే గతంతో పోల్చితే 73 సీట్లు కోల్పోయింది. మరోవైపు దీదీ మమతా బెనర్జీ నాయకత్వాన్ని పరిశీలిస్తే.. గత ఎన్నికల్లో త్రుణమూల్ కాంగ్రెస్ 227 సీట్లను సాధించగా, ఈ ఎన్నికల్లోను దాదాపుగా 211 సీట్లను కైవసం చేసుకుంది. అంటే చాలా తక్కువ స్థానాల్లో మాత్రమే ఫలితం తారుమారైంది.
దీంతో తాజా అసెంబ్లీ ఫలితాల్లో అమ్మ కంటే అక్కనే భేష్ అంటున్నారు ఫలితాలను గమనిస్తున్న జనం. ఇకపోతే అటు బెంగాల్ లోను, ఇటు తమిళనాడులోను కాంగ్రెస్ తో జతకట్టడం వల్ల లెఫ్ట్ పార్టీకి, అన్నాడీఎంకేకి పెద్దగా ఒరిగిందేమి లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications