దిగ్గీరాజా శల్య సారథ్యం: హస్తం పుట్టి మునిగింది.. కాంగ్రెస్‌కు గోవా నేతలు గుడ్ బై
న్యూఢిల్లీ / పనాజీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ లో ఘోరమైన పరాజయాన్ని కూడగట్టుకుని.. అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లోనూ దారుణ స్థాయిలో ఓటమితో క్రుంగిపోతున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అనుసరించిన విధానం, పద్దతులు ఆ పార్టీకి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. గోవాలో లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో చివరకు గోవా సీఎంగా ఉన్న పర్సేకర్ ఓటమి పాలయ్యారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌కు 18 సీట్లు, అధికారంలో ఉన్న బీజేపీకి 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఎన్నికల ముందు బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడిన మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), ప్రత్యేకించి బహిరంగంగా విమర్శలు సాగించిన గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) నేత విజయ్ సర్దేశాయి ఏకంగా మనోహర్ పారికర్ క్యాబినెట్‌లోనే చేరిపోయారు.

ఇదీ కాంగ్రెస్ నేతల తీరు
ఎన్నికల ఫలితాల వెల్లడికి ఒకరోజు ముందు పనాజీకి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్ తదితరులు తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించిన సాచివేత ధోరణే పుట్టి ముంచింది. ఫలితాలు వెలువడిన తర్వాత దిగ్విజయ్ సింగ్ తదితరులు బస చేసిన హోటల్‌కు రావడమే కాక జీఎఫ్ పీ అధినేత విజయ్ సర్దేశాయ్ ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన షరతులు వెల్లడించి వెళ్లిపోయారు. కానీ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సంప్రదించాల్సిన విద్యుక్త ధర్మాన్ని డిగ్గీరాజా విస్మరించారు. అసలు విజయ్ సర్దేశాయి చేసిన ప్రతిపాదనలు బయటపెట్టనే లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ మ్రుదులా సిన్హాను కోరాలన్న సంగతే విస్మరించారు.
కొత్త ఎమ్మెల్యేలు, ప్రాంతీయ పార్టీలతో గడ్కరీ చర్చలు
చురుగ్గా స్పందించిన కేంద్రమంత్రి గడ్కరీ
అప్పటికే పనాజీకి చేరుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వద్దకు విజయ్ సర్దేశాయి తదితరులతో సంప్రదింపులు జరిపారు. స్వతంత్ర సభ్యులు, మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ) నేతలతో మలివిడత చర్చల్లో అంగీకారం కుదిరిన వెంటనే గడ్కరీ, మనోహర్ పారికర్ వేగంగా స్పందించారు. గవర్నర్ మ్రుదులా సిన్హాను సంప్రదించాక గానీ జరిగిన తప్పిదమేమిటో కాంగ్రెస్ నేతలకు అర్థం కాలేదు. కానీ అప్పటికే కాలాతీతమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు మనోహర్ పారికర్‌ను ఆహ్వానించడం కాంగ్రెస్ పార్టీకి కష్టంగా మారింది. సుప్రీంకోర్టు తలుపు తట్టిన కాంగ్రెస్ నేతలు అసలు సంగతి మరిచిపోయారు. గవర్నర్ మ్రుదులా సిన్హాకు తమకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేల అఫిడవిట్లను సమర్పించడం విస్మరించారు. అసలు గవర్నర్‌కే వాటిని సమర్పించాలి.

అసెంబ్లీ ఏర్పాటుకు ముందే కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ కావాలా?
గోవా కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత చంద్రకాంత్ కావ్లేకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసర ప్రాతిపదికన విచారించిన చీఫ్ జస్టిస్ జేఎస్ ఖెహార్ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అదే అంశాన్ని లేవనెత్తింది. పరిస్థితులు చేతులు దాటిపోయే వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమను ఆశ్రయించడంలో ఔచిత్యమేమిటని నిలదీసింది. చివాట్లు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సరికొత్త వాదన ముందుకు తెచ్చారు. అసెంబ్లీ కొలువు తీరకముందే ‘కాంపొజిట్ ఫ్లోర్ టెస్ట్' పెట్టాలని ప్రతిపాదించారు.

గోవాలో బీజేపీ ఇలా..
గోవా ప్రజలు ఇచ్చిన ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా బీజేపీ.. ఎన్నికల్లో తన ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారు ఫలితాలు వెలువడిన తర్వాత సత్యహరిశ్ఛంద్రులుగా మారిపోయారు. పారికర్‌ను పొలిటికల్ పిక్సర్‌గా పేర్కొన్న జీఎఫ్‌ఫి నేత విజయ్ సర్దేశాయ్‌కు ప్రస్తుతం అత్యంత మంచి వాడయ్యారు. ప్రభుత్వ సారథ్యం కోసం ఒకరు.. పదవి కోసం మరొకరు రాజీ పడ్డారు. అవకాశ వాద రాజకీయాలకు దిగారు. అధికారం అండతో కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు సహజంగానే గతానుభవాల ద్రుష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానాలు చెప్తున్నారు గానీ నైతిక విలువల పరిరక్షణ సంగతి మాత్రం విస్మరించారు.

నేతల తీరుతో కాంగ్రెస్ ఇలా..
అదే సమయంలో వరుసగా పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వ కనుసన్నల్లో పనిచేసే సీనియర్లు అనుసరిస్తున్న విధానాలు, ఆలోచనలతో నామావశిష్టంగా మారిపోతున్నది. ఈ తరుణంలోనే గోవా అసెంబ్లీకి ఎన్నికైన ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు పార్టీ నాయకత్వం పట్ల నిరసనతో పార్టీకి గుడ్ బై చెప్పారు. సమీప భవిష్యత్‌లో ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారిపోవడం తథ్యంగా కనిపిస్తున్నది. ఈలోగా కాంగ్రెస్ పార్టీ ఆధి నాయకత్వం తేరుకుంటే భవిష్యత్‌లో ఎదురుచూస్తున్న నష్టాన్ని నివారించగలుగుతుంది? అలా చేస్తుందా? పార్టీకి జవసత్వాలు కలిగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందా? అంటే ఆ భారత రాజకీయ యవనికపై వేచి చూడాల్సిందే మరి.












Click it and Unblock the Notifications