ముందు ఆ పని చేసి చూపించండి.. రాహుల్‌కు ఈసీ సవాల్
Rahul Gandhi vs Election Commission: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీతో కుమ్మక్కై ఎన్నికల సంఘం దేశంలో ఎన్నికలను దొంగిలిస్తోందని ఆరోపించారు. కర్ణాటక ఓటర్ల జాబితాను ఉదహరిస్తూ.. అక్కడ భారీ స్థాయిలో ఓట్ల మోసం జరిగిందని ఆయన చెప్పారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. తన ఆరోపణలకు రుజువు చూపి, సంతకం చేసిన అఫిడవిట్ సమర్పించాలని రాహుల్ గాంధీని సవాల్ చేసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఈసీ కౌంటర్ ఇచ్చింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.. అక్రమాలు జరిగాయని భావించినా.. అనుమానాలు ఉన్నా కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చని పేర్కొంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని భావిస్తే ఆధారాలు చూపించాలని.. ఎన్నికల అక్రమాలపై అనుమానాలు ఉంటే లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలని సూచించింది.
కర్ణాటక ఎన్నికల్లో మోసం ఆరోపణలు
రాహుల్ గాంధీ కర్ణాటకలోని బెంగుళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో భయంకరమైన దొంగతనం జరిగిందని ఆరోపించారు. ఈ నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లకు గాను లక్షకు పైగా ఓట్లు దొంగిలించబడ్డాయని ఆయన అన్నారు. తమ అంతర్గత విచారణలో 1,00,250 నకిలీ ఓట్లు ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఇందులో డూప్లికేట్ ఓటర్లు, నకిలీ చిరునామాలు, ఒకే అడ్రస్‌లో ఎక్కువ ఓటర్లు మరియు నకిలీ ఫోటోలు ఉన్నాయని వివరించారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి మన్‌సూర్ అలీ ఖాన్‌పై 32,707 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. కాంగ్రెస్ ఆ ఏడు సెగ్మెంట్లలో ఆరింటిలో గెలిచినా, మహాదేవపురలో 1,14,000 ఓట్ల తేడాతో ఓడిపోయిందని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఈసీపై మరో తీవ్ర ఆరోపణ చేశారు. ఓటర్ల జాబితాను ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఇవ్వడానికి ఈసీ నిరాకరిస్తోందని, ఒకవేళ ఇస్తే 30 సెకన్లలోనే ఈ మోసం బయటపడుతుందని ఆయన అన్నారు. ఓటరు జాబితా పత్రాలను కంప్యూటర్ ద్వారా చదవడానికి వీలు లేని విధంగా ఇస్తున్నారని, దీని వల్ల విశ్లేషణ చేయడం కష్టమవుతోందని రాహుల్ పేర్కొన్నారు. వారు ఇకపై ప్రజాస్వామ్యాన్ని రక్షించడం లేదు, దానిని కూల్చివేయడానికి సహాయం చేస్తున్నారంటూ రాహుల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. .
ఎన్నికల సంఘం స్పందన
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం గట్టిగా స్పందించింది. తన ఆరోపణలకు మద్దతుగా సంతకం చేసిన అఫిడవిట్ సమర్పించాలని ఈసీ రాహుల్‌ను కోరింది. లేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని ఆపివేయాలని హెచ్చరించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు భావిస్తే, దానిని చట్టబద్ధంగా హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ ద్వారా మాత్రమే సవాలు చేయాలని ఈసీ గుర్తు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ కర్ణాటకలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఒక నిరసన మార్చ్‌ను నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications