ఎయిర్ ఫోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ లో హృదయానికి హత్తుకునే సన్నివేశం
నాసిక్‌లోని కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్‌లో జరిగిన ఓ అపురూప ఘట్టం అందరి హృదయాలను హత్తుకుంది. భారత వైమానిక దళ పైలట్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న భరత్ భరద్వాజ్.. తన ప్రియురాలు ఆరుషికి ప్రపోజ్ చేశారు. తాను ట్రైనింగ్ తీసుకున్న హెలికాప్టర్ ముందు మోకరిల్లి ఆమెకు ఉంగరాన్ని బహూకరిచి, అద్భుతమైన రీతిలో వివాహ ప్రపోజల్ చేశాడు. ఇది అక్కడివారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ జంటకకు జీవితంలో మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది.
పైలట్‌గా తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న భరత్ భరద్వాజ్ ఈ ఉదయం పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు. దీనికి ఆయన కుటుంబ సభ్యులు, ప్రియురాలు ఆరుషి హాజరయ్యారు. పాసింగ్ అవుట్ ముగిసిన వెంటనే అందరి సమక్షంలో వివాహ ప్రతిపాదన చేశాడు.

దీక్షాంత కార్యక్రమం పూర్తయిన తర్వాత, హెలికాప్టర్ ముందు మోకరిల్లి, భారత్ తన జేబులోంచి ఉంగరాన్ని తీశాడు. ఆరుషి వేలికి ఉంగరం తొడిగి, "నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" అంటూ ప్రపోజ్ చేశాడు. ఈ ప్రపోజల్ గురించి ఆరుషికి ఏమాత్రం ఊహ లేదు. ఊహించని ఈ క్షణంతో ఆమె కాసేపు ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే తేరుకుని ఆ ప్రతిపాదనను అంగీకరించారు.
ఈ మధుర క్షణాన్ని భారత్ మిత్రులు తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అనూహ్య సంఘటనతో అక్కడ ఉన్న అధికారులు, భరత్ కుటుంబసభ్యులు, మిత్రులు ఆనందంతో మునిగిపోయారు. ఈ సందర్భంలో భరత్ మాట్లాడారు. "అధికారిగా ప్రతిరోజూ చాలామంది నుంచి తాము సెల్యూట్ అందుకుంటాం, చేస్తాం. కానీ ఇంట్లో మాత్రం భార్యే నిజమైన బాస్.." అని వ్యాఖ్యానించారు.
తనకు ఇలాంటి ప్రత్యేకమైన సర్ ప్రైజ్ ఉంటుందని అస్సలు ఊహించలేదని ఆరుషి చెప్పారు. ఈ ప్రపోజల్‌తో తాను ఉద్వేగానికి లోనయ్యానని, చాలా ఆనందంగా ఉన్నానని ఆమె తెలిపారు. భరత్‌కు నేటి నుంచి దేశ సేవకు అంకితమయ్యే సందర్భం అని, ఆయన ప్రయాణంలో తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఇది ఎప్పటికీ మరచిపోలేని ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications