ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్- మూడేళ్ల గరిష్టానికి వడ్డీ రేటు పెంపు..!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్ధ (ఈపీఎఫ్ఓ) ఇవాళ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతీ ఏటా ఉద్యోగులు దాచుకుంటున్న సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అదీ గత మూడేళ్లలో గరిష్టంగా పెంచింది. అసలే ఎన్నికల సమయం కావడంతో కేంద్రం ఇలా గరిష్ట వడ్డీ రేటు పెంపుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులకు ఇది వరంగా మారనుంది. వివరాల్లోకి వెళితే..
2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగులకు భవిష్య నిధిపై చెల్లించే వడ్డీ రేటును పెంచుతూ ఈపీఎఫ్ఓ ఇవాళ నిర్ణయం ప్రకటించింది. గత మూడేళ్లలో గరిష్టంగా 8.25 శాతానికి దీన్ని పెంచింది. గతేడాది మార్చిలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2021-22లో ఉన్న 8.10 శాతం నుండి 2022-23కి వడ్డీ రేటును స్వల్పంగా 8.15 శాతానికి పెంచింది. ఇప్పుడు దాన్ని 8.25 శాతానికి పెంచడంతో మూడేళ్ల గరిష్టానికి ఇది నమోదైంది.

2022 మార్చిలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్ధ పీఎఫ్ పై వడ్డీని 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఉన్న 8.5 శాతం నుంచి కనిష్టంగా 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 1977-78లో నిర్ణయించిన 8 శాతం తర్వాత ఇదే అత్పల్పం. ఆ తర్వాత ఇప్పుడు పెంచిన 8.25 శాతమే గరిష్టంగా నమోదైంది. ఈ మేరకు ఇవాళ సమావేశమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనను అనుమతి కోసం కేంద్ర ఆర్ధిక శాఖకు పంపుతారు. అక్కడ కూడా ఆమోదం లభిస్తే ఆరు కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది.












Click it and Unblock the Notifications