ఈ పని పెద్దది, 50 రోజుల టైం అడిగా, ఇబ్బందులుంటాయని చెప్పా: మోడీ
రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో బ్యాంకుల్లో ఇప్పటి దాకా రూ.5 లక్షల కోట్ల రూపాయలు జమ అయ్యాయని, నేను ప్రజలను 50 రోజుల సమయం అడిగానని ప్రధాని మోడీ అన్నారు.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో బ్యాంకుల్లో ఇప్పటి దాకా రూ.5 లక్షల కోట్ల రూపాయలు జమ అయ్యాయని, నేను ప్రజలను 50 రోజుల సమయం అడిగానని, ఈ పని చాలా పెద్దది అని, సమయం పడుతుందని, మనమంతా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ముందే చెప్పానని ప్రధాని మోడీ అన్నారు.
ఆదివారం నాడు ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని ఆగ్రాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నల్లధనం నియంత్రణ కోసం నేను తీసుకున్న చర్యను ప్రజలందరూ స్వాగతించారన్నారు. పెద్ద నోట్ల మార్పిడీకి మంచి స్బపందన వస్తోందన్నారు.
నవంబర్ 8 తర్వాత విద్యుత్ బకాయిలు వసూలు అయ్యాయని చెప్పారు. ఇబ్బందులు పడుతున్నా ప్రజలంతా అండగా నిలిచారని చెప్పారు. పేదలు, మధ్యతరగతి ప్రజల వద్ద ఎలాంటి నల్లధనం ఉండదని, పెద్ద నోట్ల రద్దుతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే అన్నారు.

కానీ నల్లకుబేరులకు జీవితాంతం ఇబ్బందులు తప్పవని చెప్పారు. నిజాయితీపరులైన పేదలు, మధ్యతరగతి ప్రజలకు సహాయం చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలని కాదన్నారు. దేశ ప్రయోజనాలు, యువ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
సమస్యను ఎదుర్కొంటూనేస పేద ప్రజలు తనకు మద్దతుగా నిలిచారని చెప్పారు. మద్దతుగా నిలిచిన అందరినీ అభినందిస్తున్నానని తెలిపారు. మీ కష్టాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోను వృథా కానివ్వనని చెప్పారు. మీ కలలను సాకారం చేస్తానన్నారు. అవినీతిపరులు, నల్లధనం నుంచి దేశానికి విముక్తి కలిగిస్తున్నామన్నారు.
2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్నదే తన కల అన్నారు. యూపీలోని కాన్పూర్ రైలు ప్రమాదం పైన కూడా ప్రధాని మోడీ స్పందించారు. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. చిట్ ఫండ్ స్కాంను కొందరు పెంపొందించారని, ఇప్పుడు వారు తనను ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications