ఉరికి బదులుగా నొప్పి తెలియకుండా మరణ శిక్ష అమలు: కేంద్రం
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో ఉరి శిక్ష అమలులో ఉంటోంది. ఉరి తీయడం ద్వారా మరణశిక్షను అమలు చేసే విధానాన్ని సుదీర్ఘకాలం నుంచి అనుసరిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. మెడకు ఉరి తాడును బిగించి- ఊపిరి ఆగేంత వరకూ వేలాడదీయడం అనేది ఆనవాయితీగా పాటిస్తోంది. ఆ సమయంలో ఖైదీ నొప్పితో విలవిల్లాడుతాడని, దీన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది.
సీనియర్ అడ్వొకేట్ రిషి మల్హోత్రా ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. దీనిపై తన వైఖరిని తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చి 21వ తేదీన నోటీసులను జారీ చేసింది. దీనికి తాజాగా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఉరి తీయడానికి బదులుగా ఖైదీలకు నొప్పి తెలియకుండా లేదా నొప్పిని తగ్గించేలా మరణ శిక్షను అమలు చేసే విధానాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.

ఈ మేరకు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనానికి లిఖితపూరక సమాచారం ఇచ్చారు. ఉరికి ప్రత్యామ్నాయంగా నొప్పి లేకుండా మరణశిక్ష విధానాన్ని అమలు చేయడంపై అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఈ నిపుణుల కమిటీలో ఎవరిని సభ్యులుగా ఉంచాలనే విషయంపై సుప్రీంకోర్టును సంప్రదిస్తామని ఏజీ వెంకటరమణి వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి- ఖైదీలకు నొప్పి తెలియకుండా లేదా దాన్ని తగ్గించేలా మరణ శిక్షను అమలు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సదరు ఖైదీపై మానవత్వాన్ని చూపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

అతని గౌరవానికి భంగం కలగకుండా, సామాజికంగా అందరికీ ఆమోదయోగ్యమైన విధానాల ద్వారా మరణశిక్షను అమలు చేయాలని, ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఇది సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. దీనిపై అధ్యయనం చేయాలని సూచించింది. ఉరికి బదులుగా ప్రత్యామ్నాయ పద్ధతులతో మరణశిక్షను అమలు చేయడంలో ఎదురైన సామాజిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి వివరాలు, సమాచారం, డేటా వంటివి.. మన దేశంలో లేదా విదేశాలలో ఉన్నాయా? అంటూ సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications