గ్రామాభివృద్ధి కోసం: పంచాయతీ ఎన్నికల పోటీలో 102ఏళ్ల బామ్మ
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో జూన్ 2న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 102 ఏళ్ల బామ్మ గౌతమమ్మ పోటీకి సిద్ధమయ్యారు. చామరాజనగర్ జిల్లా కొళ్లేగాల తాలూకా దొడ్డలత్తూరు గ్రామ పంచాయతీలో వార్డు స్థానానికి ఈమె నామినేషన్ పత్రాల్ని సమర్పించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
తన నామినేషన్ పత్రాల్లో 102 ఏళ్లుగా ధ్రువీకరణ ఇచ్చారు. మనవడి ఒత్తిడి కారణంగానే బరిలో దిగానని ఈ బామ్మ చెబుతున్నారు. అంతేగాక, తన భర్త హవలనాయక ఆశయాలను నెరవేర్చేందుకు తాను పోటీలో దిగుతున్నట్లు చెప్పారు.

తన భర్త గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. కాగా, హవలనాయక మరణం తర్వాత గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే హవలనాయక భార్య గౌతమమ్మను ఎన్నికల్లో గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు.
తాను ఒక వేళ ఎన్నికల్లో గెలిస్తే తన భర్త ఆశయాలకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిప్తానని గౌతమమ్మ తెలిపారు. ప్రస్తుతం గౌతమమ్మ.. తన ఒక్కగానొక్క కొడుకు మరణంతో అతని కొడుకు మంజు వద్ద ఉంటోంది. గ్రామస్తుల ఒత్తిడి మేరకే తమ నానమ్మ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని గౌతమమ్మ మనవడు మంజు తెలిపాడు.
కాగా, ఎన్నికల్లో గౌతమమ్మతోపాటు మరో ఐదుగురు పోటీలో ఉన్నారు. గ్రామంలో మొత్తం 900 ఓట్లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications